కళింగ యుద్ధం! | Sakshi
Sakshi News home page

కళింగ యుద్ధం!

Published Sun, Apr 28 2024 5:45 AM

BJD Vs BJP in Odisha

బీజేడీ, బీజేపీ హోరాహోరీ 

సత్తా చాటే యత్నాల్లో కాంగ్రెస్‌ 

పోలింగ్‌ తేదీలు: మే 13, 20, 25, జూన్‌ 1

సర్వేలు ఏం చెబుతున్నాయి... 
బీజేడీకి 11, బీజేపీకి 10 లోక్‌సభ స్థానాలు రావొచ్చని సర్వేలు అంచనా వేశాయి. అసెంబ్లీలోనూ బీజేపీ–బీజేడీ మధ్య టఫ్‌ ఫైట్‌ ఉండొచ్చని అంచనా. బీజేడీనే అధికారాన్ని నిలబెట్టుకున్నా బీజేపీకి 60 సీట్ల వరకు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. 

ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటైన ఒడిశాలో పాతికేళ్లుగా బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నయక్‌ ఏకఛత్రాధిపత్యం సాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రతిసారీ మెజారిటీ స్థానాలు బీజేడీకే దక్కుతున్నాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. రాష్ట్రంలో పాగా వేసేందుకు బలమైన పునాదులు ఏర్పాటు చేసుకుంది. రాష్ట్రంలో మళ్లీ సత్తా చాటేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ‘కళింగ’ యుద్ధంలో ఈసారి మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడుతున్నాయి. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

ఒడిశాలో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీకి ఊహించని షాక్‌ తగిలింది. మొత్తం 21 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి 12 సీట్లకే పరిమితమైంది. 8 సీట్లు కోల్పోయింది. బీజేపీ కూడా ఒంటరిగా బరిలో నిలిచి 8 స్థానాలు కొల్లగొట్టింది! 2014 ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు గెలుచుకున్న కాషాయ పార్టీ ఏకంగా 7 సీట్లను పెంచుకుంది. కాంగ్రెస్‌ సారథ్యంలోని యూపీఏ కూటమి పూర్తిగా చేతులెత్తేసింది. కాంగ్రెస్‌ 18 చోట్ల పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జేఎంఎం సున్నా చుట్టాయి. 

నవీన్‌ మ్యాజిక్‌... 
సీఎంగా, కేంద్ర మంత్రిగా వెలుగు వెలిగిన బిజూ పట్నయక్‌ కుమారుడైన నవీన్‌ 1997లో జనతాదళ్‌ను వీడారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ) పేరుతో పార్టీ పెట్టి తిరుగులేని శక్తిగా అవతరించారు. ఒడిశా అంటే నవీన్‌ పట్నయక్‌ అనే స్థాయిలో పాతికేళ్లుగా పాతుకుపోయారు. వరుసగా ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎంగా కొనసాగుతున్న రెండో వ్యక్తిగా (సిక్కింలో పవన్‌ చామ్లింగ్‌ తర్వాత) నిలిచారు. తొలుత కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో చేరిన నవీన్‌ వాజ్‌పేయి ప్రభుత్వంలో గనుల శాఖ మంత్రిగా చేశారు. 2000 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో మెజారిటీ సీట్లను గెల్చుకుని తొలిసారి ఒడిశా సీఎం అయ్యారు. నాటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. 2004లో ఎన్డీఏ కేంద్రంలో అధికారం కోల్పోయినా ఒడిశాలో మాత్రం నవీన్‌ జోరు తగ్గలేదు. 2008లో కొంధొమాల్‌ జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో ఎన్డీఏ కూటమిని వీడారు నాటినుంచీ ఒంటరిగానే పోటీ చేస్తూ వస్తున్నారు. 

లోక్‌సభ పోరులో తడబాటు 
2019లోనూ ఒడిశాలో జమిలి ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీలో 147 స్థానాలకు 112 చోట్ల నెగ్గిన బీజేడీ లోక్‌సభ పోరులో 12 సీట్లకు పరిమితమైంది. అనూహ్యంగా 8 సీట్లకు ఎగబాకిన బీజేపీ, అసెంబ్లీలో కూడా బలాన్ని 10 నుంచి 23 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్‌ కేవలం 9 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకుంది. ఎన్డీఏకు దూరంగా ఉన్నా పార్లమెంట్‌లో పలు కీలక బిల్లులపై ఎన్డీఏకు బీజేడీ మద్దతు కొనసాగిస్తూనే ఉంది! 15 ఏళ్ల తర్వాత నవీన్‌ మరోసారి ఎన్డీఏలో చేరేలా కని్పంచినా చివరికి ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి ఎజెండాను నవీన్‌ ఎన్నికల ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. 

అభివృద్ధే మా నినాదం, గుర్తింపు. దీనికి ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ప్రతిదీ రాజకీయం చేస్తూ ప్రాజెక్టులకు మోకాలడ్డుతున్నాయి. అభివృద్ధి నిరోధకులుగా మారాయి. వాటి అసలు రంగేమిటో ఒడిశా ప్రజలకు తెలుసు. వచ్చే పదేళ్లను ‘ఒడిశా దశాబ్ది’గా మార్చి చూపిద్దాం. 2036 నాటికి రాష్ట్రాన్ని దేశంలో 
నంబర్‌వన్‌గా నిలిపేందుకు పునరంకితమవుదాం. – హింజిలిలో ఎన్నికల ప్రచార ప్రారంభం సందర్భంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌ 

ఒడిశాలో రాష్ట్రాన్ని నడుపుతున్నది అధికారులే. బీజేడీ ప్రభుత్వం పూర్తిగా చతికిలపడింది. అపారమైన ఖనిజ వనరులున్నా రాష్ట్ర ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. నవీన్‌ పట్నయక్‌కు పాతికేళ్లు అధికారం కట్టబెట్టారు. మాకు ఐదేళ్లు అవకాశమివ్వండి. 20 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు దీటుగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. – సోనేపూర్‌ ఎన్నికల సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా 

ఇండియా కూటమి పోటీ ఇచ్చేనా...! 
కాంగ్రెస్‌ పరిస్థితి ఒడిశాలో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. నాయకత్వం లేమితో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు రెండింట్లోనూ పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈసారి కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ఆశ పడుతోంది. ఒడిశాలో 93 శాతం హిందువులే. 3 శాతం క్రైస్తవులు, 
2.5 శాతం మేర ముస్లింలున్నారు.

హిందూ జనాభాలో 40 శాతం ఆదివాసీలు, దళితులు. వీరిలో ఎస్టీలు 23 శాతముంటారు. ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ ఓట్లే లక్ష్యంగా చేపట్టిన దేశవ్యాప్త కులగణన అస్త్రం ఒడిశాలో బాగా కలిసొస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. 6 న్యాయాలు, 25 గ్యారంటీలతో కూడిన మేనిఫెస్టోను కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇండియా కూటమిలో భాగంగా జేఎంఎం, సీపీఐ, సీపీఎంతో కలిసి పోటీ చేస్తోంది. మోదీ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్లతో కుమ్మక్కు అంశాలను కూడా గట్టిగా ప్రచారం చేస్తోంది.  

బీజేపీలోకి వలసల జోరు 
బీజేపీకి ఒడిశాలో ఒకప్పుడు సరైన ప్రాతినిధ్యమే లేదు. అలాంటిది ఇప్పుడు లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీతో నువ్వా నేనా అన్నట్టుగా తలపడే స్థాయికి చేరింది. మోదీ ఫ్యాక్టర్‌తో పాటు అభివృద్ధి ఎజెండా, రామమందిర అంశంతో హిందూ ఓటు బ్యాంకును కొల్లగొట్టేలా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఈసారి ఎంపీ సీట్లను రెండంకెలకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. బీజేడీ నుంచి పలువురు నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటుండటం విశేషం. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేడీ నేత అరబింద ధాలి బీజేపీలో చేరారు.

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని బల్లగుద్ది చెబుతున్నారు! కటక్‌ నుంచి వరుసగా 6 సార్లు ఎంపీగా గెలిచిన బీజేడీ నేత భర్తృహరి మహతాబ్‌ కూడా బీజేపీ గూటికి చేరారు. ఆ పార్టీ టికెట్‌పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన ఒడిశా తొలి సీఎం కృష్ణహరి మహతాబ్‌ కుమారుడు. బీజేడీ వ్యవస్థాపక సభ్యుడు కూడా. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సిద్ధాంత్‌ మహాపాత్ర కూడా కాషాయ జెండా కప్పుకున్నారు. ఆయన బరంపురం నుంచి బీజేడీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కీలక నేతగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్‌ ఈసారి సంభాల్‌పూర్‌ నుంచి బరిలోకి దిగారు. ఆయనను బీజేడీలో నంబర్‌ టూగా వెలుగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌ ఢీకొంటున్నారు. దాంతో సంభాల్‌పూర్‌ హాట్‌ సీట్‌గా మారింది. 

Advertisement
Advertisement