సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడే వారితో కలిసి పనిచేసి బీజేపీని గద్దె దించుతామని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నడుచుకునేలా తెలంగాణ జాగృతి పంథాను మార్చుకుని, దేశ ప్రజలను చైతన్యపరిచేలా, చర్చను రగిలించేలా కార్యాచరణ మొదలు పెడుతున్నామని తెలిపారు.
‘తెలంగాణ జాగృతి తరహాలో భారత్ జాగృతి రిజిస్టర్ చేశాం. ఇతర రాష్ట్రాలకు జాగృతి కార్యకలాపాలను విస్తరిస్తాం. ఆయా రాష్ట్రాల్లో జాగృతి కార్యవర్గాలను ఏర్పాటు చేస్తాం..’అని చెప్పారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఆమె అనేక అంశాలను ప్రస్తావించారు. సీబీఐ విచారణకు సంబంధించి మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు.
జ్ఞానపీఠ్ తరహాలో అవార్డుకు కసరత్తు
‘భారత్ జాగృతి, ఇండియా టుడే భాగస్వామ్యంతో సాహిత్య జాగృతి పేరిట ఇటీవల కార్యక్రమం జరిగింది. జ్ఞానపీఠ్ తరహాలో ప్రతిష్టాత్మక అవార్డు ఇచ్చేందుకు తెరవెనుక కొందరు కవులు, రచయితలు, కళాకారులు పని చేస్తున్నారు. తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి నడుమ సోదర బంధం ఉంటుంది. మనకు బతుకమ్మ తరహాలో ఆంధ్ర ప్రజలకు అట్ల తద్దె, బిహార్‌లో ఛత్‌పూజ లాంటివి ప్రసిద్ధి. అందరి సంస్కృతులను గౌరవిస్తూనే జాతీయ భావన కొనసాగిస్తాం. బుర్జ్ ఖలీఫా పైకి బతుకమ్మ ఎక్కడం వెనుక 12 ఏళ్ల శ్రమ ఉంది..’అని కవిత తెలిపారు.
బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్
‘బీఆర్‌ఎస్ ఒక స్వతంత్ర పార్టీ. కేసీఆర్ మానస పుత్రిక. అందులో ఏకైక స్టార్ కేసీఆర్. త్వరలో బలీయ శక్తిగా మారతారు. నేను ఆయన సైనికురాలిని. ఆయన ఆదేశిస్తే బీఆర్‌ఎస్‌లో ఏ పాత్ర ఇచ్చినా దేశం కోసం పనిచేస్తా. విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే బీఆర్‌ఎస్ ప్రధాన ఉద్దేశం. కర్ణాటక ఎన్నికల్లో ఏది ఉత్తమమో ఆదే విధానాన్ని అనుసరిస్తాం. దేశంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు, నెలకొన్న సమస్యలపై మౌనం పాటించకుండా సరైన సమయంలో స్పందిస్తాం.
ప్రస్తుతం ఎన్‌డీఏకు స్నేహితులు ఎవరూ లేరు. మిత్రులను మింగడం బీజేపీకి మొదటి నుంచి తెలిసిన విద్య. అందుకే అందరూ బయటకు వచ్చారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు బీఆర్‌ఎస్ మంచి వేదిక అవుతుంది. బీఆర్‌ఎస్‌ది విశ్వజనీన భావన.. విద్వేష వాదన కాదు. మొత్తంగా ‘అబ్ కీ బార్ .. కిసాన్ సర్కార్’అనేది మా నినాదం. బీఆర్‌ఎస్ ఏర్పాటుతో బీజేపీ నేతలకు బ్రెయిన్ డ్యామేజీ అయింది..’అని కవిత అన్నారు.
ఆ పార్టీలన్నీ కాషాయ చిలుకలే
‘తెలంగాణలో రాజకీయ చర్చ దిగజారుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పదవికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. మహిళలను అవహేళన చేస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా. రాష్ట్రంలో టీడీపీ, బీఎస్‌పీ, జనసేన, వైఎస్సార్‌టీపీ అనేవి బీజేపీ వదిలిన కాషాయ చిలుకలు, కాషాయ బాణాలే. మేము ఎన్నడూ ఆంధ్ర ప్రజలను తిట్టలేదు. కేవలం రాజకీయ నాయకులను ప్రశ్నించాం. తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్ర ప్రజలకు కూడా మేలు కలిగింది. రాహుల్ పాదయాత్ర ప్రభావం చూపిస్తుందనుకుంటే.. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కేది..’అని కవిత అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment