భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రానున్న లోక్‌సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్‌సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు.
"ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు.
కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్‌పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment