అబద్ధాల రాజకీయాలను చిత్తుగా ఓడించారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కేవలం అభివృద్ధి రాజకీయాలకే ప్రజలు పట్టం కట్టారని, అబద్ధాల రాజకీయాలను చిత్తుచిత్తుగా ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రగిల్చిన విద్వేషాలను జనం తిప్పికొట్టారని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విభజన శక్తులను, ప్రతికూల రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో స్థిరత్వానికే ఓటు వేశారని, సమాజాన్ని అస్థిరపర్చాలని చూసే వారికి తగిన గుణపాఠం నేర్పారని అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికలు ఐక్య సందేశాన్ని ఇచ్చాయని, ఏక్ హై తో సేఫ్ హై నినాదాన్ని బలపర్చాయని వెల్లడించారు. జార్ఖండ్ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రకటించారు. జార్ఖండ్ మరికొంత కష్టపడి పనిచేస్తే బీజేపీ గెలిచేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే...
విభజన శక్తులను ప్రజలు మట్టి కరిపించారు
‘‘ఏక్ హై తో సేఫ్ హై అనే నినాదం మొత్తం దేశానికి మహామంత్రంగా మారింది. దేశాన్ని కులం, మతం పేరిట ముక్కలు చేయాలని చూస్తున్న దుష్ట శక్తులను ఈ మంత్రం శిక్షించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసి ఆదరించారు. రాజ్యాంగం పేరిట అబద్ధాలు ప్రచారం చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను చిన్నచిన్న గ్రూప్‌లుగా విడదీసి లాభపడొచ్చని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి.
కానీ, ప్రజలు ఆయా పారీ్టల చెంప చెళ్లుమనిపించారు. విభజన శక్తులను మట్టి కరిపించారు. దేశంలో మారుతున్న పరిస్థితులు, వాస్తవాలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అస్థిరతను ఓటర్లు కోరుకోవడం లేదు. దేశమే ప్రథమం(నేషన్ ఫస్టు) అనే సూత్రాన్ని నమ్ముతున్నారు. పదవే ప్రథమం(చైర్ ఫస్టు) అని కలలు కంటున్నవారిని ఎంతమాత్రం విశ్వసించడం లేదు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది.
ఆ హామీలను అమలు చేయ డం లేదు. ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పనితీరు ఆధారంగా మహారాష్ట్రలోనూ ఆ పార్టీపై ప్రజలు ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే ఎన్ని హామీలిచ్చి నా ఎన్నికల్లో గెలిపించలేదు. కాంగ్రెస్ తప్పుడు హామీలు, ప్రమాదకరమైన ఎజెండా మహారాష్ట్రలో పనిచేయలేదు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగం మాత్రమే పని చేస్తుందని మహారాష్ట్ర ఎన్నికలు తేటతెల్లం చేశాయి’’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment