సాక్షి, హైదరాబాద్: ఎన్నికల అఫిడవిట్లలో తప్పులుంటే అభ్యర్థులకు తెలియజేసి సరిదిద్దేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్‌కు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై సీఈఓ వికాస్‌రాజ్ బుధవారం తన కార్యాలయంలో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించారు.
సమావేశం అనంతరం ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. 43లక్షల మంది ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామని, మరో 7లక్షల కార్డుల పంపిణీ చేయాల్సి ఉందని సీఈఓ తెలిపినట్టు వెల్లడించారు. అనుబంధ ఓటర్ల జాబితాను ఈ నెల 10న ప్రకటిస్తామని సీఈఓ తెలిపారన్నారు.
ఆ అధికారులను తప్పించాలి: కాంగ్రెస్
నాగర్‌కర్నూల్‌జిల్లా పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ నేతలపై కేసులు పెడుతున్నారని, అక్కడి డీఎస్పీ, ఇతర పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ ఉపాధ్యక్షులు నిరంజన్, మల్లు రవి తెలిపారు. హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి నామినేషన్ పత్రాలను నింపడంలో అభ్యర్థులకు సహకరించాలని కోరామన్నారు. సీఈఓ కార్యాలయం నుంచి ఉన్నత స్థాయి అధికారులు ఫోన్ చేసినా క్షేత్ర స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల పరిశీలకుల వివరాలను సీఈఓ కార్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని సూచించారు.
రేవంత్‌పై చర్యలు తీసుకోవాలి: బీఆర్‌ఎస్
అభ్యర్థుల బీ–ఫారాలను చాలా యాంత్రికంగా తిరస్కరిస్తున్నారని బీఆర్‌ఎస్ లీగల్ సెల్ నేత సోమా భారత్ తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినా ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోందని తప్పుబట్టారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మహిళల ముందే బూతులు మాట్లాడారని, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. రేవంత్‌కి భాష తెలియకపోతే తన భార్య, పిల్లల వద్ద నేర్చుకోవాలన్నారు.
చర్యలు తీసుకోకపోతే ఎన్నికలు ఆపండి: బీజేపీ
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బీఆర్‌ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని, వాళ్లపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీజేపీ లీగల్‌సెల్ నేత ఆంథోని రెడ్డి అన్నారు. చర్యలు తీసుకోకుంటే ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతామన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్‌లు అభ్యంతరకర భాషలో మాట్లాడకుండా నియంత్రించాలని కోరామన్నారు.
పరిశీలనకు నలుగురికి అనుమతి
నామినేషన్ల పరిశీలనలో ఒక్కో అభ్యర్థి తరఫున నలుగురు వ్యక్తులను మాత్రమే అనుమతిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. ఎన్నికల ఏజెంట్, ప్రపోజర్, మరో వ్యక్తితో కలసి పరిశీలన ప్రక్రియలో పాల్గొనేందుకు గాను అభ్యర్థి ముందుగా రాతపూర్వకంగా ధ్రువీకరణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఏర్పాట్లపై బుధవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై అవగాహన కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించిన దరఖాస్తులను అభ్యర్థులు స్వయంగా గాని, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ఎన్నికల ఏజెంట్ ద్వారా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు.
అభ్యర్థి స్వయంగా రాని పక్షంలో, తనను ప్రతిపాదించిన వ్యక్తి/ ఎన్నికల ఏజెంట్‌కి అధికారం ఇస్తున్నట్టు రాతపూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి 9 రోజుల్లోగా 40 మందికి మించకుండా స్టార్ క్యాంపైనర్ల జాబితాను రాజకీయ పార్టీలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రచార అనుమతుల కోసం సువిధ పోర్టల్‌ను వినియోగించాలన్నారు.
సగానికి పైగా ఫిర్యాదులు వాస్తవమే: ఈ నెల 10 నుంచి బీఎల్‌ఓల ద్వారా ఓటరుఇన్‌ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తామని వికాస్ రాజ్ తెలిపారు. కోడ్ ఉల్లంఘనలపై సీ–విజిల్ యాప్ ద్వారా 3205 ఫిర్యాదులు అందగా, 1961 ఫిర్యాదులు వాస్తవమేనని తేలిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment