1. ఖలీల్ అహ్మద్ (నెల్లూరు, సాధారణ కార్యకర్త) 2. సర్నాల తిరుపతిరావు (మైలవరం, రైతు) 3. ఈర లక్కప్ప (మడకశిర, ఉపాధి హామీ కూలీ) 4. గూడూరి ఉమాబాల (నరసాపురం ఎంపీ అభ్యర్థి, న్యాయవాది) 5. ఎం.వీరాంజనేయులు (శింగనమల, టిప్పర్ డ్రైవర్)
వైఎస్సార్‌సీపీలో నిబద్ధత గల కార్యకర్తలకూ ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు
రాష్ట్ర చరిత్రలో సరికొత్త ఒరవడికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం
జన బలం, ప్రజా సేవే గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక
కార్యకర్తలు, జెడ్పీటీసీ సభ్యులు, మేయర్, జెడ్పీ చైర్‌పర్సన్‌లకు అందలం
నెల్లూరులో కోటీశ్వరుడు నారాయణపై ఖలీల్ అహ్మద్ పోటీ
మైలవరంలో రైతు బిడ్డకు అవకాశం.. ఇక్కడ టీడీపీ టికెట్‌కు కోటీశ్వరులు
దేవినేని ఉమా, వసంతకృష్ణ ప్రసాద్‌ల మధ్య బాబు వేలం పాట
కోటీశ్వరుల బరి నరసాపురం లోక్‌సభ స్థానంలో న్యాయవాది ఉమాబాలకు అవకాశం
మడకశిరలో ఉపాధి హామీ కూలీ.. శింగనమలలో టిప్పర్ డ్రైవర్
సీఎం జగన్ సాహసోపేత నిర్ణయంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు
జన బలమే గీటురాయిగా, ప్రజా సేవే ప్రామాణికంగా, నిబద్ధతే పరమావధిగా కింది స్థాయి కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ప్రజాస్వామ్యానికి మరోసారి సరైన అర్థం చెప్పారు. రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసి.. ఓటుకు నోటు అలవాటు చేసిన 40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు యధావిధిగా పార్టీని నమ్ముకున్న వారిని కాదని, కోట్లు కుమ్మరించే బడాబాబులకే రకరకాల ఆఫర్లతో సీట్లు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులుగా పార్టీలో కష్టపడి పని చేస్తున్న మామూలు కార్యకర్తలకు అసాధారణ అవకాశం కల్పించారు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రజా సమస్యలపై సూక్ష్మ స్థాయిలో అవగాహన ఉండి.. వాటి పరిష్కారం కోసం కృషి చేస్తూ.. జనం మన్ననలు పొందుతున్న సామాన్యులకు పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సాధారణ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలుస్తూ టిక్కెట్లు ఇచ్చి ఆర్థికంగా బలవంతులైన పెత్తందార్లపై పోటీకి దింపుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయ పరిశీలకులు, సామాజిక వేత్తలు ప్రశంసిస్తున్నారు.
విద్యా వ్యాపారిపై కార్మికుడు పోటీ
నారాయణ విద్యా సంస్థల ద్వారా విద్యా వ్యాపారం చేస్తూ.. 2014–19 మధ్య రాజధాని భూ కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం, పట్టణ పేదలకు పక్కా గృహాలు ఇచ్చే పేరుతో టిడ్కో ఇళ్ల కుంభకోణానికి పాల్పడిన మాజీ మంత్రి నారాయణ రూ.వేలాది కోట్లకు పడగలెత్తారు. రూ.900 కోట్లకుపైగా పార్టీ ఫండ్ ఇచ్చిన నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బరిలోకి దించితే.. వైఎస్సార్‌సీపీలో సాధారణ కార్యకర్త ఖలీల్ అహ్మద్‌ను సీఎం జగన్ పోటీకి పెట్టారు.
మైనార్టీ కుటుంబానికి చెందిన ఖలీల్ అహ్మద్ బంగారు అభరణాల తయారీ పని చేస్తూ.. వచ్చే కూలీ డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూనే పేదల సమస్యలపై పోరాటం చేశారు. అదే మొన్న నెల్లూరు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇచ్చేందుకు దోహదపడింది. కార్పొరేటర్‌గా ఎన్నికైన ఖలీల్ అహ్మద్‌ను సీఎం జగన్.. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా చేశారు. సమస్యల పరిష్కారంలో డిప్యూటీ మేయర్‌గా ఖలీల్ అహ్మద్ పనితీరుపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తుండటంతో ఆయనకు నెల్లూరు సిటీ నియోజవర్గం నుంచి సీఎం జగన్ టికెట్ ఇచ్చారు.
మైలవరంలో రైతు బిడ్డ పోటీ
మైలవరంలో టీడీపీ అభ్యర్థిత్వం కోసం కోటీశ్వరులు మాజీ మంత్రి దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్‌ల మధ్య వేలం పాట నిర్వహిస్తున్న చంద్రబాబు.. ఎవరు ఎక్కువ పాడుకుంటే వారికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమైతే.. ఆ స్థానం నుంచి జనబలమే గీటురాయిగా బీసీ వర్గానికి చెందిన రైతు బిడ్డ సర్నాల తిరుపతిరావును వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎంపిక చేశారు.
మైలవరంలో తిరుపతి రావు ప్రజా సమస్యల పరిష్కారానికి చూపుతున్న చొరవను గమనించిన సీఎం జగన్.. మొన్నటి ఎన్నికల్లో జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. జెడ్పీటీసీ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తిరుపతిరావు.. జనంతో మేమకవుతూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇదే ఆయనను మైలవరం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయానికి దారితీసింది.
నరసాపురం ఎంపీ స్థానంలో బీసీ మహిళకు అవకాశం
నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి కోటీశ్వరులను రాజకీయ పార్టీలు బరిలోకి దించడం రివాజు. ఆ లోక్‌సభ స్థానం అభ్యర్థిగా గూడురి ఉమాబాలను సీఎం వైఎస్ జగన్ ప్రకటించగానే రాష్ట్రం యావత్తు ఆశ్చర్యపోయింది. బీసీ వర్గంలోని శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నుంచి వచ్చిన న్యాయవాది ఉమాబాల.
వైఎస్సార్‌సీపీలో సాధారణ కార్యకర్తగా చేరిన ఆమె ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతూ అంచలంచెలుగా ఎదిగారు. జనబలమే గీటురాయిగా ఉమాబాలను నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా సీఎం జగన్ ఎంపిక చేశారు. ఆ స్థానం నుంచి బరిలోకి దించేందుకు వేల కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు.
చిలకలూరిపేటలో నిబద్ధతగల కార్యకర్త పోటీ
గుంటూరుకు చెందిన కావటి మనోహర్‌నాయుడు కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నుంచి వచ్చారు. వైఎస్సార్‌సీపీలో సాధారణ కార్యకర్తగా ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటాలు చేస్తుండటాన్ని పసిగట్టిన సీఎం జగన్.. మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు కార్పొరేషన్‌లో కార్పొరేటర్ టికెట్ ఇచ్చారు. అత్యధిక మెజార్టీతో కార్పొరేటర్‌గా ఎన్నికైన మనోహర్ నాయుడు నిబద్ధత, అంకిత భావం చూసి ఆయన్ను గుంటూరు మేయర్‌గా చేశారు.
మేయర్‌గా రాణిస్తూ అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటుండటంతో చిలకలూరిపేట నియోజకవర్గం అభ్యర్థిగా అవకాశమిచ్చారు. ఈ స్థానం నుంచి 2014–19 మధ్య మంత్రిగా పనిచేసి, అక్రమార్జన ద్వారా వందల కోట్లు కాజేసిన పత్తిపాటి పుల్లారావును టీడీపీ అభ్యర్థిగా టీడీపీ బరిలోకి దించడం గమనార్హం.
ఉపాధి కూలీ.. టిప్పర్ డ్రైవర్‌లకు అవకాశం
► శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం ఫళారం గ్రామానికి చెందిన ఈర లక్కప్ప బీఏ వరకు చదువుకున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన ఇతను అవివాహితుడు. ప్రభుత్వం ఇచ్చిన రెండు గదుల ఇంట్లో తన తల్లితో కలిసి నివసిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తూ వచ్చే కూలీతో తన తల్లి కడుపు నింపుతున్న ఈర లక్కప్ప.. మండల కేంద్రం గుడిబండకు వివిధ సమస్యలపై వచ్చే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అర్జీలు రాసి ఇస్తూ.. వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో 2015లో చేరిన ఇతని సేవా భావాన్ని గమనించిన సీఎం వైఎస్ జగన్.. మడకశిర నియోజకవర్గం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఉపాధి హామీ కూలీని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతూ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
► అనంతపురం జిల్లా శింగనమల మండలం బండమీదపల్లికి చెందిన మన్నెపాకుల వీరాంజనేయులు ఎస్సీ కుటుంబానికి చెందిన వారు. ఏంఏ వరకు చదువుకున్న ఇతను టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సాధారణ కార్యకర్త ఈయన కరోనా సమయంలో ప్రజలకు సహాయం చేయడంలో చూపిన నిబద్ధతను గుర్తించిన సీఎం వైఎస్ జగన్.. శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
స్థానిక సంస్థల నుంచి చట్టసభలకు..
► కర్నూలు జిల్లా చిప్పగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ సాధారణ కార్యకర్త అయిన బుసినే విరూపాక్షి బీసీ వర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన రైతు బిడ్డ. నిబద్ధత, నిజాయితీ, సేవా భావాన్ని గమనించి మొన్నటి జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆ మండలం నుంచి అభ్యర్థిగా విరూపాక్షిని సీఎం జగన్ బరిలోకి దించారు. అత్యధిక మెజార్టీతో జెడ్పీటీసీగా ఎన్నికైన ఆయన ప్రజా సమస్యల పరిష్కారంలో చూపుతున్న చొరవను గమనించి.. ఆలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
► కర్నూలు నగరానికి చెందిన బీవై రామయ్య బీసీ వర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన రైతు బిడ్డ. వైఎస్సార్‌సీపీలో సాధారణ కార్యకర్త స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బీవై రామయ్యకు ఉన్న చిత్తశుద్ధిని పసిగట్టిన సీఎం వైఎస్ జగన్.. మొన్న కర్నూలు నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్‌గా టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన బీవై రామయ్యను కర్నూలు నగరానికి మేయర్‌గా చేశారు. మేయర్‌గా రాణిస్తూ అన్ని వర్గాల ప్రశంసలు అందుకుంటుండటంతో కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
► శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి చెందిన పిరియా విజయ రైతు కుటుంబానికి చెందిన మహిళ. బీఏ చదువుకున్న ఆమె వైఎస్సార్‌సీపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చిత్తశుద్ధిని గమనించిన సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడంతో శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా చేశారు. ఆ పదవిలో రాణిస్తున్న విజయను ఇప్పుడు ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
► అరకు వ్యాలీ నియోజకవర్గానికి చెందిన రేగం మత్స్యలింగం ఉపాధ్యాయుడు. ప్రజా సేవలో ఆయనకున్న అంకిత భావాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో హుకుంపేట మండలం నుంచి బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి.. ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపుతుండటంతో అరకు వ్యాలీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
► ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ సాధారణ కార్యకర్త అయిన దద్దాల నారాయణ యాదవ్‌కు మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం జగన్ అవకాశం కల్పించారు. జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికైన నారాయణ యాదవ్ ప్రజా సేవలో చూపుతున్న అంకిత భావాన్ని గమనించి.. కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఈ నియోజకవర్గంలో కోట్లకు పడగలెత్తిన ముక్కు ఉగ్రనరసింహారెడ్డిని చంద్రబాబు బరిలోకి దించడం గమనార్హం.
► డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ కుటుంబానికి చెందిన వారు. వైఎస్సార్‌సీపీ సాధారణ కార్యకర్త అయిన ఇతను మొన్నటి జడ్పీ ఎన్నికల్లో జెడ్పీటీసీ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ పదవిలో మంచి పనితీరు కనబరుస్తున్న వేణుగోపాల్‌ను పి.గన్నవరం నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్ అవకాశం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment