హైదరాబాద్, సాక్షి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్‌లు వేశారు. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కాగా, కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్‌లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు కాకుంటే.. ఓటింగ్‌తో పని లేకుండా వీళ్ల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. లేకుంటే ఎమ్మెల్యేలు ఓటేయక తప్పదు.
ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 2021 నవంబర్‌లో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం 2027 నవంబర్ వరకు ఉంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వెంటనే ఇద్దరు తమ ఎమ్మెల్సీ పదవులకు(డిసెంబర్ 9వ తేదీన) రాజీనామా చేశారు. దీంతో జనవరి 4వ తేదీన ఈ రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నిక కోసం వేరువేరుగా ఓటింగ్ నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
అయితే శాసనసభలో కాంగ్రెస్‌కు తగినంత సంఖ్యాబలం ఉండడంతో.. రెండూ తమ స్థానాల్లో గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమాలో ఉంది. మరోవైపు వేర్వేరుగా షెడ్యూల్ విడుదల చేయడంతో.. వేర్వేరుగా ఓటింగ్ నిర్వహించాల్సి వస్తుండడంపై బీఆర్‌ఎస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈసీ షెడ్యూల్
- జనవరి 4వ తేదీన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
- జనవరి 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- జనవరి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ
- జనవరి 19వ తేదీ నామినేషన్ల పరిశీలన
- నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 22వ తేదీ వరకు గడువు
- 2024 జనవరి 29వ తేదీన ఎన్నికల నిర్వహణ
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు పోలింగ్.. అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి
- ఫిబ్రవరి 1 వ తేదీ లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి
కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా
1. పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు
తండ్రి: మదన్‌మోహన్‌రావు
పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992
విద్యార్హత: ఎంబీబీఎస్
పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా
కులం: ఓసీ (వెలమ)
2. పేరు: బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్
తండ్రి: బి.గంగాధర్ గౌడ్
పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966
విద్యార్హత: బీకామ్
పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా
కులం: బీసీ (గౌడ)
Comments
Please login to add a commentAdd a comment