అంతా ఊహించినట్టుగానే, ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేసినట్టుగానే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల రేసు గెలిచింది. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలైన కాసేపటికే హస్తం పార్టీ ఆధిక్యతపై స్పష్టత వచ్చింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ గాలి వీచింది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కారుపై వ్యతిరేకత ప్రభావం చూపింది. మొత్తం 119 నియోజకవర్గాలకుగాను మేజిక్ ఫిగర్‌ను దాటేసి 64 సీట్లతో హస్తం పార్టీ విజయం సాధించింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని ప్రచారంలో ధీమాగా చెప్పిన బీఆర్‌ఎస్ 39 స్థానాలకే పరిమితమైంది.
బీజేపీ మొదట్లో డబుల్ డిజిట్ దాటేలా కనిపించినా.. చివరికి ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంఐఎం తమ ఏడు స్థానాలను నిలబెట్టుకున్నా కౌంటింగ్ ఆద్యంతం గట్టి పోటీనే ఎదుర్కొంది. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ ఒకచోట గెలవగా.. సీపీఎం, బీఎస్పీ, జనసేన ఖాతా తెరవలేకపోయాయి. ఫలితాలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది. గాంధీభవన్, రేవంత్ నివాసం వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ బోసిపోయింది.
ఫలితాలపై స్పష్టత రాగానే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేస్తూ లేఖను గవర్నర్‌కు పంపగా, ఆమె వెంటనే ఆమోదించడం జరిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలు గవర్నర్ తమిళిసైని కలసి కాంగ్రెస్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందజేశారు. సీఎల్పీ నేతను ఎన్నుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో సీఎం ఎవరు అవుతారన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ గురితప్పిందని, ప్రజల తీర్పును శిరసావహిస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఎదురుదెబ్బలను ఎదుర్కొని తిరిగి నిలదొక్కుకోవడం తమకు అలవాటేనని పేర్కొన్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆ పార్టీ ఇచ్చిన ‘మార్పు’నినాదం ప్రజల్లోకి వెళ్లింది. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ప్రభావం చూపింది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ స్థానాలకుగాను 118 చోట్ల పోటీచేసిన కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీసం 60 సీట్లతో మ్యాజిక్ ఫిగర్ సాధించాల్సి ఉండగా.. నాలుగు సీట్లు ఎక్కువే ‘చే’జిక్కించుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తొలిసారిగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది.
తెలంగాణ ఏర్పాటయ్యాక వరుసగా రెండుసార్లు గెలిచి తిరుగులేని రాజకీయశక్తిగా అవతరించిన బీఆర్‌ఎస్ ఈ ఎన్నికల్లో చతికిలపడింది. మొత్తం 119 స్థానాల్లో పోటీచేసిన బీఆర్‌ఎస్ 39 సీట్లకే పరిమితమైంది. సిట్టింగ్ మంత్రుల్లో ఆరుగురు ఓడిపోగా, చీఫ్ విప్, మరో ముగ్గురు విప్‌లకూ ఓటమి తప్పలేదు. కొన్నివర్గాల ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా కనిపించినా.. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఆదరణతో బీఆర్‌ఎస్ గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు దక్కించుకుంది.
ఇక జనసేనతో పొత్తు పెట్టుకుని, 111 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో కేవలం ఒకేచోట గెలిచిన కాషాయ పార్టీకి సంఖ్యాబలం పెరగడం ఊరట కలిగించే అంశమే. అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ 7 సిట్టింగ్ స్థానాలను గెలిచి.. హైదరాబాద్ పాతబస్తీలో తన పట్టు నిలుపుకొంది. కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా పోటీ చేసిన ఏకైక స్థానం కొత్తగూడెంలో సీపీఐ విజయం సాధించింది.
ఖాతా తెరవని బీఎస్పీ, సీపీఎం, జనసేన
► రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ గత నెల 30న జరగగా.. ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సారథ్యంలో 107 స్థానాల్లో పోటీ చేసిన బీఎస్పీ.. బీజేపీతో పొత్తులో భాగంగా 8 చోట్ల పోటీ చేసిన జనసేన, 19 స్థానాల్లో బరిలో ఉన్న సీపీఎం, ఒక స్థానంలో పోటీచేసిన సీపీఐఎంఎల్ (న్యూడెమోక్రసీ) పార్టీలు ఖాతా తెరవలేదు.
► రాష్ట్రంలోనే అత్యధికంగా కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు ఏకంగా 85,576 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక చేవెళ్ల నియోజకవర్గం బీఆర్‌ఎస్ అభ్యర్థి కాలె యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల తేడాతో గట్టెక్కారు.
► బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు స్థానాల్లో పోటీచేయగా.. గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై 45,031 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కామారెడ్డిలో ఓడిపోయారు.
► టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో 32,532 ఓట్ల మెజార్టీతో బీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై విజయం సాధించారు.
► సిద్దిపేటలో బీఆర్‌ఎస్ అభ్యర్థి హరీశ్‌రావు 82,308 ఓట్ల మెజార్టీతో, సిరిసిల్లలో కేటీఆర్ 29,687 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
► స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో 23,464 ఓట్ల తేడాతో తిరిగి ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసినవారు తిరిగి గెలవరనే సెంటిమెంట్‌ను ఆయన తిరగరాశారు.
► కాంగ్రెస్ సీనియర్లలో భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్ర భాకర్, దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, జి.వివేక్, జి.వినోద్, సుదర్శన్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు తదితరులు గెలుపొందగా.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, షబ్బీర్ అలీ తదితరులు ఓటమి పాలయ్యారు.
బీజేపీ ముగ్గురు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేల ఓటమి
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలోకి దిగిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావుతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి గెలవలేకపోయారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ముగ్గురూ ఎమ్మెల్యేలుగా గెలవడం గమనార్హం.
బొటాబొటి ఓట్లతో గట్టెక్కింది వీరే..
చేవెళ్లలో కాలె యాదయ్య (బీఆర్‌ఎస్) కేవలం 268 ఓట్ల అతి తక్కువ మెజార్టీతో గెలిచారు. యాకుత్‌పురలో జాఫర్ హుస్సేన్ (ఎంఐఎం) 878 ఓట్లు, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు (కాంగ్రెస్) 1,152, దేవరకద్రలో గవినోళ్ల మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) 1,392, నాంపల్లిలో మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం) 2,037, బోధన్‌లో పి.సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) 3,062, సిర్పూరులో హరీశ్‌బాబు (బీజేపీ) 3,088, కరీంనగర్‌లో గంగుల కమలాకర్ (బీఆర్‌ఎస్) 3,163, బాల్కొండలో వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్‌ఎస్) 4,533, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్) 4,606, ఖానాపూర్‌లో ఎడ్మ బొజ్జు (కాంగ్రెస్) 4,702 ఓట్లతో తక్కువ మెజార్టీ సాధించారు.
20 మందికి 50వేలకుపైగా మెజారిటీ
రాష్ట్రంలో 20 మందికిపైగా ఎమ్మెల్యేలు 50 వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌లో కేపీ వివేకానంద్ (బీఆర్‌ఎస్) 85,576 ఓట్ల మెజార్టీ సాధించారు. సిద్దిపేటలో హరీశ్‌రావు (బీఆర్‌ఎస్) 82,308, చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) 81,660, కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు (బీఆర్‌ఎస్) 70,387, నకిరేకల్ నుంచి వేముల వీరేశం (కాంగ్రెస్) 68,839 ఓట్ల మెజార్టీతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. 50 వేలపైన మెజార్టీ సాధించినవారిలో కాంగ్రెస్ నుంచి 13 మంది, బీఆర్‌ఎస్ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment