‘రాష్ట్రంలో కుస్తీలు.. ఢిల్లీలో పిల్లికూనలు’.. టీఆర్‌ఎస్‌ తీరుపై రాఘవులు ఫైర్‌ | CPM Leader Raghavulu Fires On BJP And TRS | Sakshi
Sakshi News home page

‘రాష్ట్రంలో కుస్తీలు.. ఢిల్లీలో పిల్లికూనలు’

Published Fri, Dec 31 2021 12:33 PM | Last Updated on Fri, Dec 31 2021 12:41 PM

CPM Leader Raghavulu Fires On BJP And TRS - Sakshi

సాక్షి, వరంగల్‌: రాష్ట్రంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు నిత్యం కుస్తీ పట్టడం.. ఢిల్లీలో మాత్రం టీఆర్‌ఎస్‌ పిల్లికూనలా మోదీకి సలామ్‌ చేయడం సిగ్గుచేటుగా ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ప్రజా సంక్షేమంపై బీజేపీ, టీఆర్‌ఎస్‌ దొందూ దొందేనని, రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందని, రాష్ట్ర వాటా లేకుండా పన్నుల రూపేణా ఆదాయాన్ని కేంద్రమే కాజేస్తోందని ఆయన ఆరోపించారు.

వరంగల్‌ శంభునిపేటలో గురువారం జరిగిన సీపీఎం జిల్లా మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం తగ్గే వరకూ పోరాటాలు చేయాల్సిన ఆవసరం ఉందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం మతతత్వ, హిందూత్వానికి పెద్దపీట వేస్తూ.. మతాల మధ్య చిచ్చుపెడుతూ మతమార్పిడిని ప్రోత్సహిస్తోందన్నారు. బీజేపీ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌తో మైనార్టీలకు రక్షణ కరువైందని మండిపడ్డారు.

బీజేపీ అగ్రకులాల వ్యవస్థను పెంచి పోషిస్తున్న క్రమంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహిళలకు రక్షణ కరువైందని, అత్యాచారాలు పెరిగిపోయాయని, శిక్షించాల్సిన చట్టాలే నిందితులను రక్షిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, మరణాల సంఖ్య భారీగా పెరిగిందని, అదే చైనా, రష్యా వంటి దేశాల్లో కరోనా నియంత్రించడంలో సఫలీకృతమయ్యారన్నారు.

గులాబీ, కాషాయం రంగులు మారుస్తుందే తప్ప ఎరుపు రంగు ఎన్నటికి మారదన్నారు. సమాజంలో దోపిడీ, దుర్మార్గులు ఉన్నంత కాలం సీపీఎం బతికే ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఎం ఉద్యమాలు, పోరాటాలు మరింత ఉధృతంగా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇక నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులు ఇస్తూ యువతను మద్యానికి బానిస చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు.  మహాసభలు పోరాటలకు కేంద్ర బిందువుగా మారాలని, ఉద్యమాలకు పుట్టినిళ్లు వరంగల్‌ నుంచే కార్యాచరణ రూపొందించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు  జి.రాములు, జిల్లా కమిటీ సభ్యులు రత్నమాలు, సీహెచ్‌ రంగయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య, హనుమకొండ, వరంగల్‌ జిల్లా కార్యదర్శులు సుకన్న, రంగన్న, కార్యకర్తలు పాల్గొన్నారు.  

చదవండి: వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్‌’ యాడ్‌.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement