కర్నూలు సిటీ: తెలుగు దేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. కర్నూలు శివారులోని ఎంఆర్‌సీ ఫంక్షన్ హాలులో ఆ పార్టీ జిల్లా స్థాయి జయహో బీసీ సభను ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన కోట్ల వర్గీయుడిగా గుర్తింపుపొందిన మాచాని సోమ్‌నాథ్ సభకు హాజరయ్యారు. ఆయనను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వేదికపైకి ఆహ్వానించారు. దీంతో సమావేశంలో బీవీ అనుచరులు ఈలలు, కేకలు వేస్తూ వేదికపైకి సోమ్‌నాథ్ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంలో బీవీ అనుచరులు, సోమ్‌నాథ్ అనుచరులు కుర్చిలు పైకెత్తి బాహాబాహీకి దిగారు. కార్యకర్తలను జిల్లా అధ్యక్షుడు సముదాయించినా వినిపించుకోలేదు. ‘ఓ జయ నాగేశ్వరరెడ్డీ .. నీ అనుచరులకు చెప్పుకుంటావా? సమావేశం నుంచి వెళ్లిపోతావా?’ అంటూ అధ్యక్షుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో తమ నాయకుడి పేరు రాకపోవడం..ఈసారి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్న బీవీ జయనాగేశ్వరరెడ్డికి ఏ సర్వేల్లో కూడా అనుకూలంగా రాకపోవడంతోనే సీటు ఖరారు చేయలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ తరుపున ఇన్‌చార్జిగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రకటించడంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా బీసీలకే ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీవీ వర్గానికి చెందిన వారు చంద్రబాబు నాయుడు ఆలోచనలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ నాయకుడికి సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తి
ఉమ్మడి జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన చంద్రబాబు..మిగిలిన నియోజకవర్గాల్లో ఖరారు చేయకపోవడంతో అధినేత నిర్ణయంపై ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆలూరు నియోజకవర్గం పంచాయతీ తేల్చకపోవడంతో ఆ నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జిల్లా స్థాయిలో జరిగిన జయహో బీసీ సభకు దూరంగా ఉన్నారు. ఇక ఆదోనిలో పొత్తులో భాగంగా జనసేనకు ఇస్తారని టీడీపీ నేతలు ఏ కార్యక్రమం కూడా చేయడం లేదు. మంత్రాలయంలోనూ అదే పరిస్థితి.
ఈసారి అక్కడ బీసీలకు ఇస్తారని ప్రచారం ఉండడంతో ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి అధినేత పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం ఇన్నేళ్లు పని చేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని డిమాండ్ చేశారు. సభలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, తెలుగు యువత మాజీ ఉపాధ్యక్షులు రామకృష్ణ, మాజీ ఎంపీపీ కృష్ణారెడ్డి, వివిధ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment