భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు.
అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు.
ప్రజల్లోకి వెళ్లేదెలా?
గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు.
నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు.
చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం
అంతర్మథనంలో పార్టీ శ్రేణులు..
క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్‌ఎస్‌లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు.
ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు
కోరుతున్నారు.
మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే..
మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు.
నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో?
రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment