న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభంలో ఐపీఎల్ మ్యాచ్‌ను తలపించాయి. ఫలితాల తొలి రౌండ్ల ట్రెండ్స్ పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. మంగళవారం(అక్టోబర్8) ఫలితాలు వెలువడడం మొదలైన కొద్దిసేపటికి హర్యానాలో లీడ్స్ పూర్తిగా కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చాయి. తొలి రౌండ్ల లీడ్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను కూడా దాటేసింది.
ఇంకేముంది ఎగ్జిట్‌పోల్స్ చెప్పినట్లుగా కాంగ్రెస్‌దే ఈసారి హర్యానా పీఠమని అంతా అనుకున్నారు. అటు హర్యానా, ఇటు ఢిల్లీలో కూడా కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరని టీవీ ఛానళ్లు కథనాలు కూడా వేయడం మొదలుపెట్టాయి. ఇంతలోనే వచ్చింది అసలు ట్విస్టు.
ఒక్కసారిగా ఫలితాల ట్రెండ్స్ తలకిందులయ్యాయి. హస్తాన్ని వెనక్కినెట్టి కమలం జెట్ స్పీడుతో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది.కాంగ్రెస్‌ను కేవలం 30పైచిలుకు సీట్లకే పరిమితం చేసి బీజేపీ మ్యాజిక్‌ఫిగర్ మార్కు 46ను అవలీలగా దాటింది. ఈ ట్రెండ్‌ను బీజేపీ తర్వాత కూడా కొనసాగించి విజయం దిశగా పయనించింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంస్థలతో పాటు రాజకీయ పండితులంతా తలలుపట్టుకున్నారు.
సంబరాలు జరుపుకోవడం ఈసారి కమలనాథుల వంతైంది. ఎగ్జిట్‌పోల్స్‌కు అందని ఫలితాలు సాధిస్తామని తాము ముందే చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.జాట్‌లలో పట్టు నిలుపుకోవడం బీజేపీకి కలిసొచ్చిందని, కురుక్షేత్ర ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది.కాగా, మరోపక్క జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా బీజేపీ ఇక్కడ కూడా గట్టిపోటీ ఇవ్వడం గమనార్హం.
ఇదీ చదవండి: హర్యానా,జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment