స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొన్నిచోట్ల ఎన్నికలను బహిష్కరించారనే వార్తలను మనం వినేవుంటాం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ పరిధిలో గల పండరి గ్రామస్తులు ఇప్పుడు విచిత్రమైన డిమాండ్ వినిపిస్తున్నారు. అది నెరవేరాకే ఓటు వేస్తామని తెగేసి చెబుతున్నారు. లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
పండరి గ్రామస్తులు కొన్నాళ్లుగా పులుల దాడులతో భీతిల్లిపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తాము ఓటువేయమని చెబుతున్నారు. పండరి గ్రామం టైగర్ రిజర్వ్‌కు ఆనుకుని ఉంటుంది. దీంతో గ్రామంలో తరచూ పులుల దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఎంతకాలమైనా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని, అందుకే తాము రాబోయే లోక్‌సభ ఎన్నికలను బహిష్కరించనున్నామని పేర్కొంటూ గ్రామస్తులు పలుచోట్ల పోస్టర్లు అంటిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ప్రధాన సమస్య పులుల భీభత్సమని, వాటి కారణంగా ఇక్కడి రైతులు పొలాలకు కాపలా కాసేందుకు వెళ్లలేకపోతున్నారని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల విద్యార్థులు కూడా పులుల భయంతో స్కూలుకు వెళ్లడం లేదని దీంతో ఇక్కడి పిల్లల భవిష్యత్తు అయోమయంగా తయారయ్యిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ ప్రాంతంలోకి పులుల రాకను అరికట్టేవరకూ తాము ఓటు వేసేందుకు వెళ్లేదిలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment