24 గంటలూ కుట్రలు, కుతంత్రాలేనా? | Gadikota Srikanth Reddy Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

24 గంటలూ కుట్రలు, కుతంత్రాలేనా?

Published Thu, Feb 24 2022 6:11 AM | Last Updated on Thu, Feb 24 2022 6:11 AM

Gadikota Srikanth Reddy Fires On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ వైపు ఉంటే.. మరోవైపు  ప్రతిపక్షనేత చంద్రబాబు కృష్ణానది కరకట్ట పక్కన అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు 24 గంటలు కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ అక్రమ భవనాన్ని కుట్రల కోటగా మార్చారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యపై సీబీఐ విచారణ పూర్తిగాకముందే ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీ నేతలపై బురదజల్లేలా ఎల్లో మీడియాకు రోజుకో లీక్‌ ఇస్తూ.. కథనాలు అచ్చేయించి.. వాటిని పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ వివేకా హత్యకేసులో పారదర్శకంగా విచారణ జరగాలని కోరుకునే సీఎం వైఎస్‌ జగన్‌ సీబీఐ విచారణను స్వాగతించారని గుర్తుచేశారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేకుండా ఉత్తర్వులు జారీచేసిన టీడీపీ నేతలే.. ఇప్పుడు ఆ సంస్థను ప్రశంసిస్తున్నారని ఎత్తిచూపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

కోర్టు ఆదేశాలతోనే రాంసింగ్‌పై కేసు
‘సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ప్రభుత్వమే పోలీసులతో కేసు నమోదు చేయించిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. జనవరి 27న గజ్జెల ఉదయ్‌కుమార్‌రెడ్డి తనను సీబీఐ అధికారి రాంసింగ్‌ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఈనెల 15న మళ్లీ ఫిర్యాదు చేశారు. అప్పటికీ పోలీసులు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు రాంసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేస్తే, ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఇది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం కాదా? కోర్టును అవమానించినట్లు కాదా? మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో రాష్ట్ర ప్రజలంతా శోకసంద్రంలో ఉంటే.. ఆయన మరణాన్ని రాజకీయం చేయడం టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా? 

హత్యలు టీడీపీకి అలవాటే
వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితులుగా ఉన్న వారిని హత్యచేయాలని చూస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించడం సిగ్గుచేటు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ క్రిమినల్‌ ఆలోచనలే చేశారు. నిరాహార దీక్షలో కూర్చున్న వంగవీటి రంగాను, విలేకరి పింగళి దశరథరామ్‌ను హత్యచేసింది, ఒక ప్రజానాయకుడిని బతికుండగానే హింసించి చంపింది టీడీపీ నేతలు కాదా? హత్యలు చేయించే అలవాటున్న టీడీపీ నేతలు అలాంటి అలవాటే ఇతరులకు ఉంటుందనుకోవడం దుర్మార్గం. టీడీపీ నేతలు వైఎస్‌ అవినాష్‌పై ఎందుకు బురద చల్లుతున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి, భరత్‌యాదవ్‌ చేస్తున్న ఆరోపణల్లో నిజాలను నిగ్గుతేల్చాలి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తును తప్పుదోవ పట్టించాలని టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వైఎస్‌ వివేకా గుండెపోటుతో మరణించారని ఆయన బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఎం పీ వైఎస్‌ అవినాష్‌కు తొలుత ఫోన్‌చేసి చెప్పారు. సిట్‌ దర్యాప్తులోనూ ఇదే వెల్లడైంది. కానీ వివేకా గుండెపోటుతో మృతిచెందారని వైఎస్‌ అవినాష్‌ ప్రచారం చేసినట్లు ఎలా దుష్ప్రచారం చేస్తారు?  వై ఎస్‌ వివేకా రాసిన లేఖను ఆ రోజు సాయంత్రం వరకు బయటపెట్టకుండా కేసును తప్పుదోవపట్టిం చాలని చూసింది ఎవరు? దస్తగిరి స్టేట్‌మెంట్‌ అధి కారికంగా ఇప్పటిదాకా బయటకు రాలేదు. కానీ దానిపై ఎల్లోమీడియా ఎలా కథనాలు ప్రచురించిం ది.  సీబీఐ ఎస్పీ రాం సింగ్‌ను హత్యచేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ టీడీపీ నేతలు.. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబూ.. అధికారం కోసం ఇంతగా దిగజారాలా? సిగ్గనిపించడంలేదా? 

నిజాలు బయటకు రానివ్వండి
వైఎస్‌ వివేకా హత్యకేసులో వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రమేయం ఉందని ఆధారాలున్నాయా? ఆయనపై ఆరోపణలు చేసిన వ్యక్తి డబ్బులకు ఆశపడతారని కూడా చెబుతున్నారు. అలాంటప్పుడు నిజాలు బయటకు రావాలి కదా. విచారణ పూర్తిగాకముందే రోజూ లీకులు ఎందుకిస్తున్నారని సీబీఐ అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం. వైఎస్‌ వివేకా హత్య జరిగింది టీడీపీ సర్కార్‌ హయాంలో. ఈ హత్యకేసులో టీడీపీ నాయకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అప్పట్లో ఏం కుట్ర జరిగిందో తెలియాలి. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలని, వాస్తవాలు బయటకు రావాలని కోరుకుంటున్నాం.’  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement