చేజారిన సీఎం పదవి.. స్పందించిన ఏక్‌నాథ్‌ షిండే | I Have Recommended Fadnavis For The Post Of Cm, Says Eknath Shinde | Sakshi
Sakshi News home page

ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు: సీఎం పోస్ట్‌పై షిండే

Published Wed, Dec 4 2024 4:20 PM | Last Updated on Wed, Dec 4 2024 5:08 PM

I Have Recommended Fadnavis For The Post Of Cm, Says Eknath Shinde

ముంబై : ముఖ్యమంత్రి పదవి చేజారడంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే స్పందించారు. మహాయుతి కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు  అని వ్యాఖ్యానించారు.

మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫడ్నవీస్‌తో పాటు శివసేన నేతృత్వంలోని ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నేతృత్వంలోని అజిత్‌ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

ఈ తరుణంలో మహరాష్ట్రలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి కూటమి నేతలు దేవేంద్ర ఫడ్నవీస్‌, ఏక్‌నాథ్‌ షిండేలు బుధవారం మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ఆహ్వానించారు. గవర్నర్‌ వద్ద ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యచరణను పూర్తి చేశారు. 

షిండేకి నా కృతజ్ఞతలు
అనంతరం,ఏక్‌నాథ్‌ షిండే,దేవేంద్ర ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. ‘ఏక్‌నాథ్ షిండేకి నా కృతజ్ఞతలు. మంగళవారం షిండేతో భేటీ అయ్యాను. ఈ భేటీలో మంత్రి వర్గంలో కొనసాగాలని కోరా. దానికి ఆయన అంగీకరించారు. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు  చేపట్టినా.. నిర్ణయాలు కలిసే తీసుకుంటాం’ అని అన్నారు. 
 
ఎవరూ ఎక్కువా కాదు.. తక్కువా కాదు
‘‘సీఎం పదవికి ఫడ్నవీస్‌ను నేను సిపారసు చేశా. గతంలో నన్ను సీఎంగా ఫడ్నవీస్‌ సిఫారసు చేశారు. మహాయుతిలో ఎవరూ ఎక్కువా కాదు..తక్కువా కాదు. మహారాష్ట్ర కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం’’ అని షిండే వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రిగా  రెండున్నరేళ్లు విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. గత 2.5 ఏళ్లలో మహాయుతి కూటమి నేతృత్వంలోని మేం ముగ్గురం, మా బృందం కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం చేసిన కృషి అమోఘం.. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మేం తీసుకున్న నిర్ణయాలపై మేం సంతోషంగా ఉన్నామని తెలిపారు. 

బాంబు పేల్చిన షిండే
రేపు మీరు డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు షిండే బదులిస్తూ.. రేపు ప్రమాణ స్వీకారం చేస్తారో, లేదో చెప్పకుండా..సాయంత్ర వరకు వేచి ఉండండి ’ అంటూ బాంబు పేల్చారు.

చమత్కరించిన అజిత్‌ పవార్‌
షిండే అలా మాట్లాడడంతో పక్కనే ఉన్న అజిత్‌ పవార్‌ కలగ జేసుకుని సాయంత్రం నాటికి షిండే గురించి మాకు తెలుస్తుంది. కానీ నేను ఎదురు చూడను. రేపే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానంటూ చమత్కరించారు. దీంతో అప్పటి వరకు సీరియస్‌గా సాగిన మీడియా కాన్ఫరెన్స్‌ కాస్తా..  అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలతో ఉన్న వారంతా ఒక్కసారిగా భళ్లున నవ్వడంతో వాతావరణం సందడిగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement