PM Modi Comments On Sanatan Dharma Row: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారడం లేదు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోల్చుతూ, దాన్ని నిర్మూలించాలంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలను కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఖండిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దీనిపై ఘాటుగా స్పందించారు
దేశాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు కుట్ర
ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని బినాలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. తొలిసారి సనాతన ధర్మం వివాదంపై బహిరంగంగా వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశాన్ని వెయ్యేళ్లు వెనక్కి తీసుకెళ్లి, బానిసత్వంలోకి నెట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.
భారతీయుల నమ్మకాలు, విలువలపై దాడి
‘ఇటీవల ఇండియా కూటమి ముంబైలో భేటీ అయ్యింది. ఘమండియా (దురహంకారి) కూటమిని నడిపేందు కోసం వ్యూహాలను వారు సిద్ధం చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల నమ్మకాలు, విలువలు, సంప్రదాయాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు’ అని ధ్వజమెత్తారు.
చదవండి: Special Parliament Session: ఎంపీలకు బీజేపీ విప్ జారీ
#WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says "The people of this INDIA alliance want to erase that 'Sanatana Dharma' which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak...This INDIA alliance wants to destroy 'Sanatana Dharma'. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS
— ANI (@ANI) September 14, 2023
ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, వాల్మికీ, మహత్మాగాంధీ..
దేవి అహల్యాబాయి హోల్కర్‌కు స్ఫూర్తినిచ్చిన సనాతన సంస్కృతి, సంప్రదాయాలను అంతం చేయాలని 'ఘమండియ' కూటమి కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి సనాతన ధర్మమే ఓ బలంగా నిలిచిందని. తన ఘాన్సీ ప్రాంతాన్ని వదులుకోనని బ్రిటిష్ వారికి సవాల్ విసిరిందని చెప్పారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. మహాత్మాగాంధీ సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించారన్న ప్రధాని మోదీ.. ఆయనకు రాముడు ప్రేరణగా నిలిచారని చనిపోయే ముందు కూడా ‘హేరామ్’ అని సంభోదించారని చెప్పారు.
దేశాన్ని ముక్కలు చేసేందుకు యత్నం
ఇక స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని మోదీ తెలిపారు. సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు చెప్పారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్‌ను ఒక్కటిగా నిలిపిందన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.
దేశాన్ని ప్రేమించే వాళ్లు అప్రమత్తంగా ఉండాలి
బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు మనపై దాడుల్ని ఉధృతం చేస్తారని మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు, ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టించి. దేశాన్ని 1,000 సంవత్సరాల వెనక్కు బానిసత్వంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. కలిసి కట్టుగా ఆ పోరాటాన్ని ఆపాలని.. వారి వ్యూహాలను విజయవంతం అవ్వకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
కాగా ప్రధాని కంటే ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సనాతన ధర్మంపై స్పందిస్తూ.. దీనిపై చర్యలకు దూరంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలునిచ్చారు. ‘‘సనాతన ధర్మానికి మద్దతుగా స్పందించాలంటూ ప్రధాని మోదీ తన కేబినెట్ మంత్రులకు కొన్ని రోజుల క్రితం సూచించారు. దీనిపై రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పడానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్‌లో మనం చిక్కుకోవద్దు’’ అని స్టాలిన్ వివరించారు. బీజేపీ అవినీతిని ప్రధానంగా ప్రస్తావించాలంటూ సూచించారు. కళంకిత, మతతత్వ, నిరంకుశ బీజేపీ ప్రభుత్వం నుంచి దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు కష్టపడి పనిచేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment