సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లా కూటమి నాయకుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పార్థసారథికి వార్నింగ్ ఇచ్చారు.
‘అభివృద్ధిపై ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో అబద్దాలు చెప్పారు. ఆయన గెలవక ముందు ఒకటి.. గెలిచిన తరువాత మరొక్క మాట మాట్లాడుతూన్నారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఓట్లు వేస్తేనే గెలిచి.. ప్రస్తుతం అదే టీడీపీ కార్యకర్తలను మరిచారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీని దూరంగా ఉంచడం పద్ధతి కాదు. ఇలాగే కొనసాగితే త్వరలో నిర్ణయాలు వేరుగా ఉంటాయి. టీడీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సమన్వయంతో పని చేస్తాను’ అని అన్నారు.
ఆదోని కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మీనాక్షి నాయుడు ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి స్పందించారు. ‘ఆదోని టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయి. బీజేపీలో కాని జనసేనలో కాని వర్గాలు లేవు. అందరిని సమన్యాయం చేసుకుంటూ పోతున్నాను. మీనాక్షినాయుడు తన మాటే వినాలని చెబుతున్నారు. నేను ఎమ్మెల్యేని అబద్ధాలు మాట్లాడే అవసరం నాకు లేదు. ఏది మాట్లాడినా అన్ ద రికార్డు.. ఆఫ్ ద రికార్డ్‌కి తావే లేదు. టీడీపీ పార్టీలో ఐదు వర్గాలు ఉన్నాయి. ఎవరిని పట్టించుకోకూడదు తన మాటే నడవాలి అనడం మీనాక్షి నాయుడుది ఒంటెద్దు పోకడ. ఐదు వర్గాలని కలుపుకోకుండా తెలుగుదేశం పార్టీ వాళ్లని అన్యాయం చేసింది మీనాక్షి నాయుడే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment