సొంత పార్టీలో అభ్యర్థులే లేరన్న భావనలో పవన్
ఐవీఆర్‌ఎస్ సర్వే హడావిడి.. ఆ పేర్లకు ప్రాముఖ్యత ఇవ్వని జనసేనాని
ముగ్గురూ వలస నేతలకే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం
విశాఖ సౌత్, పాలకొండ, అవనిగడ్డకు ఇప్పటికే పేర్లు ఖరారు
నేడో, రేపో అభ్యర్థుల పేరు ప్రకటించే అవకాశం
గుంటూరు, సాక్షి: పొత్తుల ప్రకటన మొదలు, చంద్రబాబు నుంచి సీట్లు దక్కించుకోవడం, అభ్యర్థుల ఎంపిక.. ఇలా అన్నింటా పవన్ కల్యాణ్ ఇంతలా అయోమయానికి గురవుతారని పదేళ్లు ఆయన వెంట నడుస్తున్న నేతలెవరూ ఊహించి ఉండరు. పైగా మునుపెన్నడూ లేనంత కుట్ర పూరిత రాజకీయాలకు తెర తీస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ జెండాలు మోసే వారి కంటే, జెండాలు మార్చే వారికే విలువ పవన్ ఇస్తున్నారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
నమ్ముకున్నవాళ్లకు సైతం పవన్ వెన్నుపోటు పొడుస్తున్న పరిస్థితులు చూస్తున్నవే. కేడర్ బలం కంటే ధనబలానికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ తీరును నిరసిస్తూ పలువురు పార్టీని వీడారు. కొందరైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంతవరకు ఆగాలనుకుంటుండగా, మరికొందరు మాత్రం ఇంకా గుడ్డిగా పవనే నమ్ముకుంటున్నారు. పెండింగ్‌లో ఉన్న విశాఖ సౌత్, ఆళ్లగడ్డ, పాలకొండలోనూ జనసేన అసలైన నేతలకు మొండిచేయే దక్కనున్నట్లు తెలుస్తోంది.
విశాఖ సౌత్‌లో వంశీకృష్ణ యాదవ్ పేరు నుంచి తొలి నుంచి వినిపిస్తోంది. వైఎస్సార్‌సీపీ వంశీని ఎమ్మెల్సీని చేస్తే.. పార్టీ ఫిరాయించి జనసేనలో చేరారాయన. అయితే విశాఖ సౌత్ నియోజకవర్గం హామీతోనే ఆయన జనసేనలో చేరినట్లు తొలి నుంచి ప్రచారం ఉంది. అయితే.. జనసేనలో తామేమీ గొర్రెలం కాదని, వంశీకి సీటు ఇస్తే ఊరుకునేది లేదంటూ జనసేన నేతలు అక్కడ ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో వంశీ తన అనుచరులతో వీరమహిళలపై దాడి కూడా చేయించారు. అయినప్పటికీ పవన్ మాత్రం వంశీకే టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
విశాఖ సౌత్‌ను పక్కనపెడితే.. అవనిగడ్డ(కృష్ణా), పాలకొండ(మన్యం) అభ్యర్థుల కోసం జనసేన తీవ్ర కసరత్తులు చేసింది. పవన్ గొంతుతో ఐవీఆర్‌ఎస్ సర్వేలు సైతం నిర్వహించింది. మరోవైపు.. తాజాగా జనసేనలో చేరికలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఆ రెండు నియోజకవర్గాల్లో కేడర్‌ను కాదని బయటివాళ్లకే అవకాశం ఇవ్వాలని పవన్ డిసైడ్ అయ్యారనే చర్చ ఊపందుకుంది.
పాలకొండలోనూ..
పాలకొండ ( పార్వతీపురం మన్యం జిల్లా) టికెట్‌ను నిమ్మక జయకృష్ణకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా ఉన్న జయకృష్ణ.. ఇవాళ జనసేన కండువా కప్పుకోబోతున్నారు. ‘‘ పార్టీ ఏది అయితే నేమి కూటమిలోనే ఉంటాం కదా’’ అని ఆయన అనుచరులు సైతం మానసికంగా సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పాలకొండలో రాజకీయ కుటుంబంగా ఉన్న జయకృష్ణ.. వరుసగా పోటీ చేస్తున్నారే తప్ప గెలవడం లేదు. అయినా కూడా ఆయనకే టికెట్ ఇవ్వనున్నారు. ఇక ఇక్కడ హ్యాట్రిక్‌పై వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని విశ్వాసరాయి కళావతి కన్నేశారు.
అవనిగడ్డ బరిలో ఆయన?
కృష్ణా జిల్లా రాజకీయాల్లో అవనిగడ్డకు ప్రత్యేక స్థానం ఉంది. ఈసారి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్లింది. అయితే అభ్యర్థి విషయంలో మాత్రం పవన్ చాలా మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెరపైకి వచ్చింది సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు.
మండలి బుద్ధప్రసాద్ ఇవాళ అధికారికంగా జనసేనలో చేరనున్నారు. దీంతో సీటు దాదాపుగా ఆయనకే ఖరారయ్యే అవకాశం కనిపిస్తోంది. అవనిగడ్డ నుంచి మూడు పర్యాయాలు బుద్ధప్రసాద్ ఎమ్మెల్యేగా నెగ్గారు. కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన గతంలో మంత్రిగా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గానూ పని చేశారు. ఇప్పుడు ఈయన కూడా జనసేన తరఫునే పోటీకి దిగడం దాదాపుగా ఖరారయ్యింది.
అవనిగడ్డలోనూ పవన్ ఐవీఆర్‌ఎస్ సర్వే నిర్వహించారు. కృష్ణారావుతో పాటు శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ (టివి9)లాంటి పలువురు అభ్యర్థుల పేర్లనూ పరిశీలించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచే వలస వస్తున్న సీనియర్ నేతకు పవన్ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో ఈ పేర్లను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment