ముందుకు కదలక మొండికేసే.. తెలుగుదేశంలో గందరగోళం
సీట్లు తేలవు.. జనం పట్టించుకోరు
రెండో జాబితాపై నోరు మెదపని చంద్రబాబు
బీజేపీతో పొత్తు కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూపులు
మరోవైపు బాబు సభలకు స్పందన కరువు
‘రా కదలిరా’ సభలన్నీ ఫ్లాప్
జనసేన– టీడీపీ ఉమ్మడి అ‘జెండా’ ఫెయిల్
ఏం చేయాలో పాలుపోక దుష్ప్రచారాన్నే నమ్ముకున్న బాబు
సాక్షి, అమరావతి: ఒకవైపు ‘సిద్ధం’ పేరుతో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి మొదటి దశను దిగ్విజయంగా పూర్తి చేసే దశలో ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా ఆ ఘట్టాన్ని ప్రారంభించలేక సతమతమవుతున్నారు.
సీట్ల ఖరారు నుంచి, ఎన్నికల సన్నాహక సభల వరకు ఏ విషయంలోనూ ఆయన అధికార పార్టీకి కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడుతున్నారు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేననే భయంతో ఇంకా పొత్తుల కోసం పాకులాడుతుండడం ఆయన బేలతనాన్ని స్పష్టం చేస్తోంది.
ఎవరు ఏ స్థానాల్లో పోటీ చేస్తారో తెలియక, అసలు పోటీ చేసే స్థానాలు ఏవో అర్థంకాక టీడీపీ నేతలు క్షేత్ర స్థాయిలో తీవ్ర నిరుత్సాహంలో మునిగిపోయారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నా ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేకపోవడం కచ్చితంగా వెనుకబాటేనని, వైఫల్యానికి ఇది నాంది అని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అభ్యర్థులు దొరక్క సతమతం
అభ్యర్థుల ఎంపిక కోసం తాను ఇంతగా ఎప్పుడూ కష్టపడలేదని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు దొరక్క ఇతర పార్టీల నేతలు, ఎన్‌ఆర్‌ఐలు, పారిశ్రాకవేత్తల వైపు ఆశగా చూస్తుండడం టీడీపీ దీన స్థితిని తెలియజేస్తోంది. వైఎస్సార్ సీసీ వరుసగా అభ్యర్థుల జాబితాలు ప్రకటిస్తున్నా టీడీపీ అభ్యర్థుల జాబితాలపై చర్చ కూడా లేక క్యాడర్ నీరుగారిపోవడంతో అప్పటికప్పుడు జనసేనతో కలిసి తొలి జాబితా చంద్రబాబు విడుదల చేశారు.
దానిపైనా తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతుండడంతో టీడీపీ మరింత ఇరకాటంలో పడింది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లు వదులుకోవడాన్ని టీడీపీ నాయకులు జీరి్ణంచుకోలేక రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. ఈ కారణంతోపాటు క్షేత్ర స్థాయిలో పట్టు కోల్పోవడంతో పలువురు సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి చూపడంతో వారి నుంచి తిరుగుబాటు స్వరం వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు వారిని బుజ్జగించలేక సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయడం చంద్రబాబుకు కత్తి మీద సాములా మారింది. బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తుండడం, ఆ పార్టీ ఏ విషయాన్ని ఇంకా తేల్చకపోవడంతో టీడీపీలో అసహనం రోజురోజుకీ పెరిగిపోతోంది. ఆ పొత్తు కోసం కీలకమైన ఎంపీ స్థానాలు, పలు ఎమ్మెల్సీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేయలేదు.
ముక్కీమూలిగి ఎలాగోలా కొందరు ధనబలం ఉన్న అభ్యర్థులను పట్టుకున్నా బీజేపీతో పొత్తు తేలకపోవడంతో ఏ విషయాన్ని తేల్చలేకపోతున్నారు. దీంతో నియోజకవర్గాల్లో టీడీపీ కేడర్ ఆందోళనలో మునిగిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా పొత్తులు కొలిక్కి రాకపోవడం, అభ్యర్థులను ఖరారు చేయలేకపోవడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది.
సభలు విఫలంతో విలవిల
మరోవైపు ‘రా కదలిరా’ పేరుతో చంద్రబాబు నిర్వహించిన సభల వైఫల్యం టీడీపీ వాస్తవ బలాన్ని తేటతెల్లం చేసింది. ప్రతి పార్లమెంటు పరిధిలోనూ ఒక సభ నిర్వహించడానికి ప్రణాళిక రూపొందించినా దాన్ని అమలు చేయడానికి అష్టకష్టాలు పడుతున్నామని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సభకూ జనం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో చంద్రబాబు అక్కడి నేతలపై రుసరుసలాడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. 20కిపైగా నిర్వహించిన సభల్లో చంద్రబాబుకు ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయి.
కేవలం టీడీపీ మాత్రమే సభ పెడితే జనం రావడంలేదని జనసేనతో కలిసి ఇటీవల తాడేపల్లిగూడెంలో ‘తెలుగు జన కేతన జెండా’ పేరుతో ఉమ్మడి సభ నిర్వహించారు. కానీ ఆ సభనూ జనం పట్టించుకోలేదు. చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘శంఖారావం’ పేరుతో నిర్వహించిన యాత్ర టీడీపీ గాలిని పూర్తిగా తీసివేసింది. వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభలు ఒకదాన్ని మించి ఒకటి సూపర్ హిట్ అవుతున్నా టీడీపీ, జనసేన సభలు విఫలమవడం క్షేత్ర స్థాయిలో టీడీపీ పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.
వీటన్నింటి కంటే ముందు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు ప్రకటించిన ముందస్తు మేనిఫెస్టోనూ జనం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాల పేర్లనే మార్చి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి అభాసుపాలయ్యారు. ఈ పరిస్థితుల్లోనూ జనం నమ్మడం లేదని అర్థమై బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని అయినా రేసులో నిలబడి పోటీ ఇవ్వవచ్చనే ఉద్దేశంతో చేస్తున్న యత్నాలు ఫలితాన్ని ఇవ్వడంలేదు. వరుస వైఫల్యాలతో ఎన్నికలకు సిద్ధంగా లేని చంద్రబాబు దు్రష్పచారాన్ని మాత్రమే నమ్ముకున్నారు.
ఎల్లో మీడియా, సోషల్ మీడియా అండతో వైఎస్ జగన్‌పై కనీవినీ ఎరుగని రీతిలో అబద్ధాలు, విష ప్రచారాలకు దిగారు. తాను అధికారంలో లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం నాశమైనపోయిందనే రీతిలో తన మేనేజ్‌మెంట్ నైపుణ్యంతో ప్రచారం చేస్తున్నా జనానికి మాత్రం వాస్తవం కళ్లెదుటే కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు ఇంకా ఎన్నికలకు సిద్ధం కాలేక తన పాతకాలపు వ్యూహాలను నూరుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment