న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(DelhiElections) సమీపిస్తున్న కొద్ది అక్కడ రాజకీయం వేడెక్కుతోంది. క్రమంలోనే ఢిల్లీ మాజీ సీఎం,ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvindkejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం అతిషి(Atishi)ని త్వరలోనే ఏదో తప్పుడు కేసులో అరెస్టు చేస్తారన్నారు. ఈ మేరకు బుధవారం(డిసెంబర్25) ఎక్స్(ట్విటర్)లో కేజ్రీవాల్ ఒక పోస్టు చేశారు.
సీఎం అతిషి ఇటీవల ముఖ్యమంత్రి సంజీవని యోజన,మహిళా సమ్మాన్ యోజన పథకాలు ప్రకటించడంతో కొందరు వణుకుతున్నారని అందుకే ఆమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందే పలువురు ఆమ్‌ఆద్మీ పార్టీ కీలక నేతల ఇళ్లలో సోదాలు జరగవచ్చని కేజ్రీవాల్ తెలిపారు.
కాగా, ఢిల్లీలో మహిళలకు నెల నెలా రూ.2100 నగదు ఇచ్చే మహిళా సమ్మాన్ యోజన స్కీమ్ ఏదీ లేదని, స్కీమ్ పేరుతో ఎవరైనా ప్రజల సమాచారం సేకరించడం నేరమని ఢిల్లీ మహిళా,శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది.
ఓ వైపు ఆమ్‌ఆద్మీపార్టీ ఈ స్కీమ్ కింద అర్హుల వివరాలు సేకరిస్తున్న వేళ మహిళా,శిశు సంక్షేమ శాఖ చేసిన ప్రకటన రాజకీయ వివాదానికి కారణమైంది. దీనిపై బీజేపీ మరో విధంగా స్పందించింది. కేజ్రీవాల్ అతిషి మధ్య సంబంధాలు దెబ్బతినడం వల్లే ఆప్ స్కీమ్‌పై ప్రభుత్వం చర్యలకు దిగిందని ఆరోపించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మళ్లీ గెలిస్తే మహిళా సమ్మాన్‌యోజనతో పాటు సంజీవని స్కీమ్ అమలు చేస్తామని తదితర హామీలిచ్చింది. ఈ స్కీమ్‌లపై బీజేపీ,ఆప్‌ల మధ్య రాజకీయ మాటల తూటాలు పేలుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment