ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ కేసులో చిక్కి రాజమండ్రి జైలుకు వెళ్లిన సందర్భంలో ఆయన కుమారుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనకు రాజకీయాలలో ఇంకా మెచ్యూరిటీ రాలేదన్న సంగతి బోధపడుతుంది. తన తండ్రి జైలుకు వెళ్లవలసిన పరిస్థితి రావడం లోకేష్కు సహజంగానే బాద కలిగిస్తుంది. ఆయన దానిపై స్పందించవచ్చు. తప్పు లేదు. ఆయన తరపున ఎవరో ట్విటర్ లో రాసి ఉండవచ్చు. అందులో ఏమంటారు..కోపం కట్టలు తెంచుకుంటోంది..రక్తం మరుగుతోంది.. అని ఆయన అన్నారట. లోకేష్‌కు కోపం వస్తే లోకం వణికిపోతుందా?ఆయనకు రక్తం మరిగితే ఆయనకే బీపీ వస్తుంది తప్ప ఎవరికి ఏమీ కాదు.
✍️ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలతోనే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నారనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పెరగాల్సింది విజ్ఞత, పెరగాల్సింది వినయం, పెరగాల్సింది తెలివి. పెరగాల్సింది వివేచన, పెరగాల్సింది సహనం. తన కోపమే తనకు శత్రువు అన్న సంగతి లోకేష్ కు తెలిసి ఉండకపోవచ్చు. తండ్రి జైలుకు వెళ్ళాల్సి వస్తుందని తెలియగానే కోర్టు వద్ద ఆయనను కొందరు గమనించారు. భయంతో ఆయన కుంగిపోయారట. ఒక్కసారిగా డల్ అయిపోయారట. ఇది సహజమే. తప్పుకూడా కాదు. వాస్తవం అదైతే ప్రకటన మాత్రం గంభీరంగా కనిపించడానికి ఆయన రచయితలు ప్రయత్నం చేశారని తెలిసిపోతుంది. ఇంతకీ లోకేష్ ఎందుకు భయపడి ఉంటారు.
✍️కేవలం తండ్రి జైలుపాలయ్యారనేనా?లేక తాను కూడా జైలుకు వెళ్లే ప్రమాదం ఉందనా? ఎందుకంటే రిమాండ్ రిపోర్టులో సీఐడీ లోకేష్ కు ఆయన సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా ఈ కేసులో డబ్బులు అందాయని నేరుగా రాసింది. దాంతో తన మెడకు ఈ కేసు చిక్కుకుంటున్న సంగతి అర్ధం అయి ఉంటుంది. దీనికి ఆయన ఆందోళన చెందడం లో ఆశ్చర్యం లేదు! , రక్తం మరుగుతోందని అని డైలాగు రాసేస్తే సరిపోతుందా? తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నమే అదని తెలుస్తుది. తన తండ్రి ఎలాంటి తప్పు చేయలేదని, రాష్ట్రం కోసం అహర్నిషలు కష్టపడ్డారని..ఇలా ఏవైనా రాసుకోవచ్చు. కాని అసలు అరెస్టు అయింది ఒక కుంభకోణంలో అన్న సంగతి మరవకూడదు.
✍️చంద్రబాబును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి ఆమోదించారు.దానికి కారణం ఈ కేసులో ఇప్పటిక ఎనిమిది మంది అరెస్టు అవడం, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి నలుగురిని అరెస్టు చేయడం, నలభై కోట్ల ఆస్తులను జప్తు చేయడం వంటివి జరిగాక ఏ న్యాయమూర్తి అయినా రిమాండ్‌కు ఇవ్వక తప్పదని నిపుణులైన లాయర్లు ముందే వ్యాఖ్యానించారు. దానికి తోడు వ్యక్తిగత సహాయకుడు అయిన పెండ్యాల శ్రీనివాస్, కన్సల్టెంట్ మనోజ్‌లు విదేశాలకు పారిపోవడం కూడా పెద్ద ఆధారం అవుతుందన్న సంగతి లోకేష్‌కు తెలియకపోవచ్చు. కాని వారి తరపున వాదించడానికి వచ్చిన ప్రముఖ న్యాయవాది సిద్దార్ద లూధ్రాకు తెలుసు.
✍️అందుకే ఆయన చంద్రబాబును రిమాండ్‌కు పంపినా బెయిల్ పిటిషన్ ను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్ధించారు. స్కామ్ కేసు బలంగా ఉంది కాబట్టే ఏదో గవర్నర్ అనుమతి లేదనో, ఇరవైనాలుగు గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదనో ..ఇలాంటి సాంకేతిక కారణాలపైనే ఎక్కువగా వాదించారు. ఈ సంగతి ఇలా ఉంచితే లోకేష్ పాదయాత్ర చేస్తూ మాట్లాడుతున్న తీరు, ప్రతిసారి ఎర్రబుక్ అంటూ బెదిరిస్తున్న వైనం, ముఖ్యమంత్రి జగన్ ను, స్థానిక ఎమ్మెల్యేలను నోటికి వచ్చినట్లు దూషించడం,పోలీసులతో గొడవ పడడం .. శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని చూడడం,చివరికి చంద్రబాబును సిట్ ఆఫీస్ కు తీసుకు వచ్చినప్పుడు ఆయను కలవడానికి వచ్చిన లోకేష్ ఒక డిఎస్పి ఎవరినో దూషించడం .. ఇవన్ని ఆయనలోని అపరిపక్వతను తెలియచేస్తాయి. చంద్రబాబు కక్షపూరిత , విధ్వంస రాజకీయాలు చేయలేదని లోకేష్ వ్యాఖ్యానించారు.
✍️అది నిజమైతే రోజూ వీరిద్దరూ తాము అధికారంలోకి వస్తే వారిని అలా చేస్తాం.. వీరిని ఇలా చేస్తాం.. పోలీసు అధికారుల అంతు చూస్తాం..ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి ఎక్కువ పదవులు ఇస్తాం అనడం ఏమిటి? అదంతా కక్ష కాదా.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇంత కక్షగా మాట్లాడుతుంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంకెంత కక్షగా వ్యవహరించి ఉంటారో జనం అర్దం చేసుకోలేరా.పుష్కర కాలం క్రితం సోనియాగాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు ఆనాడు ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్‌పై చేసింది కక్ష కాక ఏమంటారు? దానివల్ల రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు రాకుండా చేసింది విద్వంసం కాకుండా ఏమవుతుంది?అప్పుడు
✍️మంత్రివర్గం నిర్ణయాలు తీసుకుంటేనేమో ముఖ్యమంత్రి వైఎస్ తప్పు చేసినట్లు, ఇప్పుడు క్యాబినెట్‌తో సంబంధం లేకుండా నిర్ణయాలు చేసినా చంద్రబాబు తప్పేమీ లేదని వాదిస్తున్నారు. అదే చిత్రంగానే ఉంటుంది.నగరి ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు శాసనసభలోకి రానివ్వకుండా అడ్డుకోవడం కక్ష అవుతుందా?కాదా? సమస్య ఎక్కడ వస్తుందంటే తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి అన్న సంగతి మర్చిపోతున్నారు.ఇంకా పవర్ లో ఉన్నట్లు భ్రమపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడైనా పద్దతిగా ఉండాలి. అలాకాకుండా చెలాయించినా ఎందుకు వచ్చిన గొడవలే అని ఆయన వద్ద పనిచేసేవారు సర్దుకుపోతారు.ఎప్పటికీ అలాగే ఉండాలని ఆయన అనుకోవడమే తెలివితక్కువ తనం అవుతుంది. ఇప్పటికైనా లోకేష్ విధానాలపైన , ప్రజలకు ఏమి చేస్తామనేదానిపై ప్రసంగాలు చేయడం అలవాటు చేసుకోవాలి తప్ప, ఎవరినిబడితే వారిని బెదిరిస్తే, రెడ్ డైరీలో రాసుకుంటున్నానంటూ లోకేష్ భయ పెట్టడం ఏమిటో అర్థం కావడం లేదు. తమకు అంతా భయపడిపోతారని అనుకుంటే అది భ్రమ అని అర్దం చేసుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment