జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించిన రీతిలోనే పలాయనవాదంతో ప్రసంగించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణల గురించి ప్రస్తావించకుండా అవనిగడ్డలో జరిగిన సభను ముగించారు. కేవలం చంద్రబాబు కేసులను జయించి బయటకు వస్తారని ఆశిస్తున్నానని ఒకసారి వ్యాఖ్యానించారు. మరోసారి అనుభవం ఉన్నవారిని కూడా జైలులో పెట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తూ అన్నారు. అంతే తప్ప చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు ఏమిటి? వాటిలో మంచి, చెడు ఏమిటి? వాటిని ఆయన నమ్ముతున్నారా? లేదా? అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని జనసేన సిద్దాంతంగా ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఊసే ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు.
పరోక్షంగా టీడీపీని ఎలాగోలా రక్షించడానికి ఆయన విఫలయత్నం చేసినట్లు అనిపిస్తుంది. కేవలం ముఖ్యమంత్రి జగన్‌ను దూషించడానికి, ఓట్ల చీలికను నిలువరించాలని కోరడానికి, తనకు తోచిన అబద్దాలను చెప్పడానికే ఆయన ఈ సభను వాడుకున్నారు. పోనీ అలా అని టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా చెప్పలేకపోయారు. సీపీఎస్ రద్దు గురించి మాట్లాడిన ఆయన తాము పవర్‌లోకి వస్తే అమలు చేస్తామని చెప్పలేకపోయారు. అమ్మ ఒడి స్కీమును అవహేళన చేసే విధంగా మాట్లాడారు. పోనీ దానిని రద్దు చేస్తామని అనలేకపోయారు. ఏతావాతా మొత్తం ప్రసంగం పరిశీలిస్తే ఎలాగోలా తనను ఈసారి అయినా గెలిపించండని ప్రజలను వేడుకున్నట్లు ఉంది తప్ప మరొకటి కాదు. తనకు సీఎం పదవి వస్తుందని కూడా ఆత్మ విశ్వాసంతో అనలేకపోయారు.
టీడీపీ అందుకు ఒప్పుకుందని తెలపలేదు. సీఎం పదవి ఇస్తే సంతోషం అని మాత్రమే అన్నారు. గతంలో చంద్రబాబుతో విబేధాలు వచ్చాయని, మళ్లీ రావచ్చని చెబుతూ జాగ్రత్తపడి ఈసారి అలా విబేధాలు రావని చెప్పడం విశేషం. జనసేన విలువలతో కూడిన పార్టీ అని చెప్పిన ఆయన టీడీపీతో ఏ విలువల ప్రాతిపదికతో కలుస్తున్నది వివరించలేకపోయారు. అధికారం కోసం అర్రులు చాచడం లేదని అంటూనే తననైనా గెలిపించాలని పలుమార్లు అన్నారు. ఆయన తన ఓటమిని మర్చిపోలేకపోతున్నారు. పదేపదే ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు. వైఎస్సార్‌సీపీ ఓటమి ఖాయమని అంటూ సీఎం జగన్ చెప్పిన కురుక్షేత్ర యుద్దం గురించి మాట్లాడి తాము పాండవులమని చెప్పుకున్నారు. బీజేపీతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తే గెలవలేమని ప్రకటించారు. ఇంతకీ బీజేపీకి విడాకులు ఇచ్చారో.. లేదో తెలపలేదు. తాను అసెంబ్లీలో ఉండి ఉంటే మెగా డీఎస్సీ గురించి నిలదీసేవాడినని, అనేకం ప్రశ్నించేవాడినని అన్నారు. మరి ఇంతకాలం ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నిలదీయలేకపోయిందని ఆయన చెప్పకనే చెప్పినట్లయింది.
మరో చిత్రమైన వ్యాఖ్య చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం సుస్థిరంగా లేనట్లుగా, టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తే సుస్థిరత ఉంటుందని అనడం విశేషం. సంకీర్ణంలో సుస్థిరత ఎలా సాధ్యమో తెలియచేయలేదు. ఆయన తనకు ఆత్మగౌరవం ఉందని చెబుతున్నారు కానీ, తన తల్లిని దూషించారని టీడీపీపై గతంలో ఆరోపించిన ఆయన ఇప్పుడు అదే పార్టీతో ఎందుకు కలిశారో చెప్పలేదు. లోకేష్, బాలకృష్ణలు జనసేనను గతంలో అవమానించారని ఆయనే అన్నారు. ఇప్పుడు తనను కలుపుకున్నందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నారు. జనసేన వారిని అలగా జనం అన్న బాలకృష్ణతో రాజీ ఎలా కుదిరిందో వివరించి ఉంటే బాగుండేది.
అనుభవం ఉన్న వ్యక్తిని కటకటాల వెనుక పెట్టారని అన్నారే తప్ప, ఆ వ్యక్తి అవినీతికి పాల్పడ్డారా? లేదా? అన్నదాని గురించి మాట్లాడలేకపోయారు. పైగా తనపై కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారని, వలంటీర్లు కొందరు తనపై కేసు వేసిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారు. టీడీపీతో రాజధాని, ప్రత్యేక హోదా విషయంలోనే విబేధాలు వచ్చాయని అన్నారు. మరి ఇప్పుడు ఆ విషయంలో ఎలా ఒప్పందం అయ్యారో చెప్పలేదు. కృష్ణా జిల్లాలో నాలుగున్నర లక్షల మందికి నీటి కుళాయిలు లేవని అన్నారు. మరి అందులో టీడీపీ ప్రభుత్వ వైఫల్యం ఉందో లేదో తెలియచేయలేదు. తనకు కులం తెలియదని చెప్పి, దానిని నమ్మించడానికి ఆయన యత్నించారు. కానీ, ఇంతవరకు ఆయన చేసిన వారాహి యాత్రలన్నీ కేవలం కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న చోట్లే చేస్తున్న విషయాన్ని ప్రజలు మర్చిపోయారని పవన్ అనుకుంటుండాలి.
ఒకసారి కులం లేదని, ఇంకోసారి కాపులైనా తనకు మద్దతు ఇవ్వరా అని రకరకాలుగా మాట్లాడిన వీడియోలు ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి. వైఎస్సార్‌సీపీకి టీడీపీ-జనసేన పొత్తు వ్యాక్సిన్ అని ఆయన అన్నారు. కాకపోతే ఆ వాక్సిన్‌కు ఇప్పటికే కాలం చెల్లిపోయిందేమో పవన్ ఆలోచించుకోవాలి. రిజిస్ట్రేషన్ విధానంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకు వస్తున్న మార్పులపై ఆంధ్రజ్యోతి చేసిన తప్పుడు ప్రచారాన్ని ఆయన కూడా చేశారు. అలాగే ఏపీలో 67వేల మంది పిల్లలు చనిపోయారంటూ పచ్చి అబద్దాన్ని చెప్పడానికి ఆయన సిగ్గపడలేదు. రాష్ట్రం అభివృద్ది చెందడం లేదని ఆరోపించిన ఆయన తాము వస్తే ఎలా అభివృద్ది చేస్తామో వివరించాలి కదా?. అసలు ఆయనకు ఉన్న ప్లాన్ ఏమిటో చెప్పగలగాలి కదా? తీర ప్రాంతం గురించి మాట్లాడిన ఆయన రామాయపట్నంలో నిర్మిస్తున్న ఓడరేవును ఒకసారి చూసి వస్తే అభివృద్ది జరిగింది లేనిది చెప్పవచ్చు.
రేపో, మాపో మచిలీపట్నం వెళుతున్నారు కదా? అక్కడ నిర్మించిన వైద్య కళాశాలను, నిర్మిస్తున్న పోర్టును చూస్తే బాగుంటుంది కదా!. పవన్ కళ్యాణ్ ప్రసంగం చూస్తే ఏదో తప్పు చేస్తున్నట్లుగా, టీడీపీతో కలవకపోతే తనకు భవిష్యత్తు లేదన్నట్లుగా మాట్లాడినట్లు ఉంది తప్ప, ఆయనలో ఒక రాజకీయ పార్టీ నడిపే వ్యక్తికి ఉండవలసిన నమ్మకం, విశ్వాసం, ఆత్మగౌరవం, స్పష్టత, ఎన్నికలలో అధికారం వస్తే ఏమి చెస్తామో చెప్పగలిగే ఎజెండా మొదలైనవి ఏవీ లేవని ఈ ప్రసంగాన్ని పరిశీలిస్తే ఇట్టే అర్దం అయిపోతుంది.
అందుకే ఆయనను ప్రజలు ఎన్నికలలో ఆదరించడం లేదని తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అవినీతి అభియోగాలకు గురైన టీడీపీ అధినేతకు కొమ్ము కాసి ఆ సిద్దాంతానికి కూడా తిలోదకాలు ఇచ్చేశారు. ఇలా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నందునే ఆయనను ప్రజలు ఎన్నుకోవడం లేదనుకోవాలి. కాకపోతే సినీ నటుడిని చూడడానికి కాస్త జనం వస్తారు. కానీ, ఆయన ఉపన్యాసం విన్నాక ఇంతకీ పవన్ ఏం చెప్పినట్లు అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటే అంతా శూన్యమే కనిపిస్తుంది.
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment