న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు సమయంలో అవకతవకలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు బాధ్యతారారహిత్యమైనవని తెలిపింది. తమకు ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో కాంగ్రెస్ నిరాధార అరోపణలు చేస్తోందని మండిపడింది. ఇలాంటి పనికిమాలిన ఫిర్యాదులు చేసే ధోరణిని అరికట్టేలా పార్టీ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈసీ సమాధానంపై తాజాగా కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సంఘం తరుచూ కాంగ్రెస్ పార్టీని, పార్టీ నతేలను టార్గెట్ చేసుకొని దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఇలాంటి వ్యాఖ్యలే కొనసాగిస్తే తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ మేరకు శుక్రవారం కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది. సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, అంతేగానీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఈసీ కార్యాలయాన్ని గౌరవిస్తున్నామని పేర్కొంది. కానీ ఎన్నికల సంఘం సమాధానాలు మాత్రం మరోలా ఉంటున్నాయని తెలిపింది. తన స్వతంత్రతను పూర్తిగా పక్కనపెట్టడమే ప్రస్తుతం ఈసీ లక్ష్యంగా పెట్టుకుందని, ఆ విషయంలో ఎన్నికల సంఘం అద్భుతమైన పనితీరు చూపుతోందని విమర్శలు గుప్పించింది.
‘ఎన్నికల సంఘం తమకు తాను క్లీన్ చిట్ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఈసీ స్పందన, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు వంటి అంశాలు మేము తిరిగి లేఖ రాసేందుకు కారణమయ్యాయి. ఎన్నికలు, ఫలితాలపై లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయడం ఎన్నికల సంఘం బాధ్యత. అయితే తన విధిని ఈసీ మరిచిపోయినట్లు అనిపిస్తోంది.
ఈసీ స్పందన కాంగ్రెస్ పార్టీపై, నాయకులపై దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసీ ఇదే తరహా భాషను కొనసాగిత్తే.. అలాంటి వ్యాఖ్యలను తొలగించేందుకు న్యాయపరమైన ఆశ్రయం పొందడం తప్ప తమకు మరో మార్గం లేదు’ లేఖలో తీవ్రంగా స్పందించింది. ఈ లేఖపై కేసీ వేణుగోపాల్, అశోక్ గహ్లోత్, అజయ్ మాకెన్ సహా తొమ్మిది మంది సీనియర్ నేతలు సంతకం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment