సాక్షి, అమరావతి: దిశ బిల్లు ప్రతులను కాల్చడం అంటే టీడీపీ నేతలకు, లోకేశ్‌కు చట్టంపై ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతోందని హోం మంత్రి మేకతోటి సుచరిత మండిపడ్డారు. మహిళల భద్రత విషయంలో టీడీపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద గురువారం ఆమె వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, రమ్య కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు వాస్తవాలు గమనించి, దిశచట్టంపై పార్లమెంట్‌లో, కేంద్రపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవాలని సూచించారు. దిశ చట్టం ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదని, అయినప్పటికీ ఆ చట్టంలో నిర్దేశించుకున్న విధంగా 1,600కు పైగా కేసుల్లో వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశామని ఆమె స్పష్టం చేశారు. ఇందులో భాగంగా నరసరావుపేట కేసులో నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ దాఖలు చేశారని వివరించారు. 7 నెలల తర్వాత అనూష కుటుంబాన్ని పరామర్శించే పేరుతో లోకేశ్ శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం తగదని విమర్శించారు.
సుగాలి ప్రీతి కుటుంబాన్ని లోకేశ్ పరామర్శిస్తారా?
కర్నూలులో 2018లో సుగాలి ప్రీతి హత్య జరిగిందని, అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆ కేసును పట్టించుకోలేదని హోం మంత్రి సుచరిత ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ కేసును సీబీఐకి అప్పగించిందన్నారు. మరి ఇప్పుడు లోకేశ్ ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారా? అని ఆమె నిలదీశారు. టీడీపీ హయాంలో ఏ కేసులో అయినా వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేశారా? అని ప్రశ్నించారు. గుంటూరుకు చెందిన రమ్య కుటుంబానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పటికే రూ.10 లక్షల సహాయం చేశామన్నారు. రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం, ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని, 10 రోజుల్లోనే అవన్నీ ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. రమ్య హత్య కేసులో వీలుంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీఎం జగన్‌ను కలిసిన రమ్య కుటుంబ సభ్యులు
ఇటీవల హత్యకు గురైన రమ్య కుటుంబ సభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. జరిగిన ఘటనను సీఎంకు ఈ సందర్భంగా రమ్య తల్లిదండ్రులు జ్యోతి, వెంకటరావు, అక్క మౌనికలు వివరించారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున వారి వెంట ఉన్నారు. అనంతరం రమ్య తల్లి నల్లపు జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment