ఎంపీ అభ్యర్థులు కావలెను | Sakshi
Sakshi News home page

ఎంపీ అభ్యర్థులు కావలెను

Published Tue, Jan 9 2024 4:28 AM

MP candidates needed For TDP in Andhra Pradesh - Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబువి అన్నీ ఢాంబికాలేనని క్షేత్రస్థాయి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే.. రాజధాని ప్రాంతం, మాకు పట్టుందని చెప్పుకుంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దొరక్క తెలుగుదేశం పార్టీ తలలు పట్టుకుంటోంది. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోటీచేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడం ఇందుకు కారణం. దీంతో ఎన్‌ఆర్‌ఐలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్‌ వరసగా రెండుసార్లు గెలిచినా ఇప్పుడు పోటీచేయడానికి ఆయన సుముఖంగా లేకపోవడం.. పైగా ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పార్టీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గల్లా జయదేవ్‌ 2019లో గెలిచిన తర్వాత రాజకీయాల్లో చురుగ్గాలేరు. ఆయన గుంటూరులో అడుగుపెట్టి రెండేళ్లు దాటింది. మళ్లీ పోటీచేయబోనని అధిష్టానానికి తెగేసి చెప్పేశారు. దీంతో గుంటూరులో పోటీచేసే అభ్యర్థుల కోసం టీడీపీ అన్వేషిస్తున్నా ఫలితం ఉండడంలేదు. మాజీమంత్రి ఆలపాటి రాజా, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను పోటీచేయాలని అడిగినా వారు ససేమిరా అంటున్నారు.

దీంతో గుంటూరులోని ఒక విద్యాసంస్థల చైర్మన్‌ను పోటీచేయాలని కోరినట్లు కూడా సమాచారం. నిజానికి.. 2019లో పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చినా అధిష్టానం అప్పట్లో ఆయన్ను పట్టించుకోలేదు. ఇప్పుడు పోటీచేయడానికి ఆయన ముందుకొచ్చి కొంత మొత్తం డిపాజిట్‌ చేసినప్పటికీ తాను పోటీచేయబోనంటూ ఆయన తప్పుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. తర్వాత రాజ్యసభకు అవకాశం కల్పించాలని కోరి పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.  

నరసరావుపేట, బాపట్లకూ ససేమిరా..
ఇదిలా ఉంటే.. నరసరావుపేట లోక్‌సభ స్థానానికి కూడా ఇప్పటివరకూ అభ్యర్థి దొరకలేదు. 2014లో చివరి నిముషంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చిన రాయపాటి సాంబశివరా>వుకు టిక్కెట్‌ ఇచ్చారు. 2019లో రాయపాటి వద్దంటున్నా బలవంతంగా ఇచ్చారు. ఇప్పుడాయన వయస్సు రీత్యా పోటీకి సిద్ధంగాలేరు. దీంతో ఇక్కడ పోటీచేసేవారి కోసం వెతుకుతున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్‌ అనే ఎన్‌ఆర్‌ఐ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఆయన కూడా అంత ఆసక్తి చూపడంలేదని సమాచారం.

ఇక బాపట్ల ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అభ్యర్థి దొరకడం టీడీపీకి తలనొప్పిగా మారింది. 2014, 2019లో పోటీచేసిన మాల్యాద్రి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోవడం, పోటీకి ఆసక్తి చూపకపోవడంతో కొత్త అభ్యర్థి కోసం అధిష్టానం వెతుకుతోంది. ఇక్కడ నుంచి గుంటూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ను పోటీచేయించాలని పార్టీ భావిస్తున్నా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో బాపట్ల ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ బుర్ర బద్దలుకొట్టుకుంటోంది. 

రూ.వంద కోట్లు చూపిస్తేనే..
మరోవైపు.. ఒక్కో ఎంపీ అభ్యర్థి పోటీ చేయాలంటే కనీసం రూ.వంద కోట్లు చూపించాలని లోకేశ్‌ అడుగుతున్నారని, అందుకెవ్వరూ ముందుకు రావడంలేదని పార్టీ నాయకులు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement