బీజేపీలో గెలుపు గుర్రాలేవి?.. కేడర్‌లో కొత్త టెన్షన్‌! | New Tension Between BJP Leaders In Karimnagar With Political War | Sakshi
Sakshi News home page

బీజేపీలో ఆ ముగ్గురే దిక్కు.. కాషాయదళంలో గెలుపు గుర్రాలేవి?

Published Thu, Sep 28 2023 9:17 PM | Last Updated on Thu, Sep 28 2023 9:17 PM

New Tension Between BJP Leaders In Karimnagar With Political War - Sakshi

తెలంగాణ బీజేపీలో అక్కడి కేడర్‌లో టెన్షన్‌ నెలకొంది...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీలోని సీనియర్ నేతలంతా రాష్ట్ర, జాతీయ స్థాయి వారే. కానీ వారిలో వారికి పొసగదు. అసలు ఒకరంటే ఒకరికి ఏమాత్రం గిట్టదు. జిల్లాలో సెకండ్ కేడర్‌ ఎదగదు. మూడు నాలుగు సెగ్మెంట్లు తప్పితే మిగిలిన చోట్ల అభ్యర్థులే కనిపించరు. అభ్యర్థులమని చెప్పుకునే వారు ఎప్పుడూ జనంలో కనిపించరు. ఈ పరిస్థితుల్లో అధికారంలో ఉన్న గులాబీ పార్టీని.. దూసుకువస్తున్న హస్తం పార్టీని కాషాయ సేన ఢీకట్టగలదా? ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దశ దిశ లేని కాషాయ పార్టీ వ్యవహారం ఎలా ఉందంటే..

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తాజా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, మరో మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ సహా పలువురు హేమాహేమీలు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కమలం పార్టీకి అండగా ఉన్నారు. ఇంతమంది ముఖ్య నేతల అండతో కొండంత బలాన్ని సంపాదించుకోవాల్సిన జిల్లాని కమలం పార్టీ దశా దిశా లేకుండా పోయిందన్నది ఇప్పుడు టాక్. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. రేపో, మాపో అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఈ రెండు పార్టీలకు ప్రచారంలో ఉన్న అభ్యర్థుల జాబితాలో చాలామంది ఇప్పటికే జనంలో యాక్టివ్‌గా ఉంటున్నారు. 

నేతల మధ్య కోల్డ్‌వార్‌..
బీజేపీ పరిస్థితి మాత్రం అలా లేదు. గతంలో రెండుమాడు సార్లు డిపాజిట్లు కోల్పోయి.. పనికిరారనుకున్న నేతలే మళ్లీ మళ్లీ తెరపైకొస్తున్నారు. వారే టిక్కెట్ల కోసం పోటీ పడతారు. అసలే ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఒకరంటే ఒకరికి గిట్టని ముఖ్య నేతల మధ్య వార్ కొనసాగుతోంది. టిక్కెట్ల పంచాయితీతో వారి మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. కరీంనగర్‌లో బండి సంజయ్, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, రామగుండంలో సోమారపు సత్యనారాయణ మినహాయిస్తే.. ఇతర సెగ్మెంట్లలో గెలుపుపై ధీమాతో బరిలో గిరి గీసే నేతలే కరువయ్యారు. దీనికి తోడు నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని పుట్టి ముంచడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. అయినప్పటికీ దిద్దుబాటు చర్యలు కనిపించడంలేదని కేడర్‌ చెబుతోంది. 

అభ్యర్థులే కరువు..
అభ్యర్థులు ఉన్నారని అనుకుంటున్న సెగ్మెంట్లు కాకుండా మిగిలిన స్థానాల సంగతి పరిశీలిస్తే.. మాజీ ఎంపీ వివేక్ బరిలో ఉంటారో, లేదో తెలియదు. ఆయన చెన్నూరు టిక్కెట్ అడుగుతున్నారని ప్రచారం జరుగుతున్నా.. మరోవైపు కాంగ్రెస్ బాట పడతారనే టాక్ నడుస్తోంది. పెద్దపెల్లిలో గతంలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డితో పాటు.. కీలక నేతలైన ప్రదీప్ రావు, గొట్టిముక్కల సురేష్ రెడ్డి వంటి వారు టిక్కెట్లు ఆశిస్తున్నా.. ఇక్కడ అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అనే ప్రచారం జరుగుతోంది. మంథనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ అనే ప్రచారం ఉండగా.. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమారుడు సునీల్ రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు.

ఇక జగిత్యాల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పేర్లే తప్ప బీజేపీకి మూడోస్థానంలో ఉండాల్సినంత పేరు కూడా లేదు. కోరుట్ల సంగతీ అంతే. హుస్నాబాద్‌లో ఆశావహుల సంఖ్య ఎక్కువ.. హోమ్ వర్క్ తక్కువ. సిరిసిల్ల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక రాజన్న క్షేత్రం వేములవాడలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ రావుతో పాటు.. కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎర్రం మహేష్ వంటివారు టిక్కెట్లు ఆశిస్తుండటంతో పాటు.. టిక్కెట్ దక్కని నేతలు కచ్చితంగా రెబల్స్ గా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. చొప్పదండి బీజేపీలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పేరు వినిపిస్తున్నా.. నియోజకవర్గంలో ఆమె పేరు ప్రచారంలోనే లేదు. ఇక మానకొండూరు నియోజకవర్గాన్ని బీజేపీ మర్చిపోయిందనే టాక్ నడుస్తోంది. 

ఆ ముగ్గురే దిక్కు..
బండి సంజయ్ బరిలోకి దిగితే కరీంనగర్.. ఈటల రాజేందర్ పోటీలో ఉంటే హుజూరాబాద్.. రామగుండంలో సోమారపు సత్యనారాయణ తప్ప బీజేపీలో గెలుపు గుర్రాలేవి? ఎక్కడా అనే ప్రశ్న ఇప్పుడు బాగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఉమ్మడి జిల్లాలోని ముఖ్య, సీనియర్‌ నేతల్లో ఒకరంటే ఒకరికి గిట్టకపోవడమే. ఏ ఇద్దరు నేతల మధ్యా సఖ్యత కనిపించడంలేదు. అందుకే జిల్లాలో బీజేపీకి ఒక దిశ అనేదే లేకుండా పోయిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement