న్యూఢిల్లీ: ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి 400కుపైగా స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తంచేయడంపై విపక్ష పార్టీలు విమర్శలు పెంచాయి. ‘‘ మోదీ కలలు కంటున్నారు. ఏకంగా 400కుపైగా సీట్లు గెల్చుకుంటామని మోదీ చెప్పడం చూస్తుంటే మళ్లీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఆయనకు లేదని అర్థమవుతోంది. బీజేపీ ప్రభుత్వం దేశ లౌకిక భావనను గాయపరిచింది.
గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను గాలికొదిలేసి ద్రోహం చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీల కోసం ఏం చేసింది? రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఎందుకు ఇంతవరకు నెరవేర్చలేదు?. గత మే నుంచి రావణకాష్టంగా రగిలిపోతున్న మణిపూర్‌లో మోదీ ఎందుకు ఇంతవరకు ఒక్కసారైనా పర్యటించలేదు?’’ అని సీపీఐ నేత బినోయ్ విశ్వం నిలదీశారు. ‘‘ 400 లేదా 500 సీట్లు గెలుస్తామని కల కనే హక్కు మోదీకి ఉంది. కానీ వాస్తవం వేరు.
వేరే వాళ్ల కలలకు తగ్గట్లు నడుచుకోవాలో, సొంత నిర్ణయాలు తీసుకోవాలో ప్రజలే నిర్ణయించుకుంటారు’ అని సీపీఐ(ఎం) నేత జాన్ బ్రిటస్ చెప్పారు. ‘ ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు ప్రస్తావించకుండా ప్రధాని ప్రసంగం అస్సలు ముగియదు. ఇందిరా గాంధీ, నెహ్రూల పేర్లు స్మరించుకుంటేగానీ మోదీకి ఎన్నికల్లో గిట్టుబాటు అవుతుంది’’ అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాకూర్ ఎద్దేవాచేశారు. ‘‘ బాధ్యతాయుతమైన ప్రధాని పదవిలో కూర్చున్నందుకైనా కాస్తంత గౌరవప్రదంగా మాట్లాడాలి.
400కుపైగా గెలుస్తామనడం చూస్తుంటే ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలొస్తున్నాయి’’ అని మరో కాంగ్రెస్ ఎంపీ డ్యానిష్ అలీ అనుమానం వ్యక్తంచేశారు. ‘‘ నెహ్రూ గతించి దాదాపు 60 ఏళ్లు గడుస్తున్నా మోదీ ఇంకా ఆయననే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి మోదీ ఇంతగా పట్టించుకుంటుంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. మోదీ ఆయన ప్రసంగమంతా కాంగ్రెస్‌కే అంకితమిచ్చారు. ఇప్పుడు పెరిగిన ధరల గురించి మోదీ ఇంకా నెహ్రూ, ఇందిర గాంధీలనే తిడుతున్నారు. ధరలు పెరిగిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ప్రతిసారీ కాంగ్రెస్ గెలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు కూడా ధరలు పెరిగాయి!’’ అని కాంగ్రెస్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment