
సాక్షి, కాకినాడ: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమి తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల టికెట్ ఆశించి భంగపడిన నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. కొందరు నేతలు ఇప్పటికే టీడీపీ, జనసేనకు గుడ్‌బై చెప్పారు.
ఇక, తాజాగా కాకినాడ రూరల్ టీడీపీలో అసమ్మతి సెగ రాజుకుంది. కాకినాడ స్థానం జనసేనకు కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కమ్రంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి నివాసాన్ని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. వెంటనే టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జనసేనకు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆవేదనకు లోనైన టీడీపీ కార్యకర్త లోవరాజు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని కాపాడారు.
మరోవైపు.. ఉండవల్లి చంద్రబాబు నివాసం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. తంబళ్లపల్లె టికెట్ శంకర్ యాదవ్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తంబళ్లపల్లె టికెట్‌ను జయచంద్రారెడ్డికి కేటాయించడాన్ని శంకర్, ఆయన వర్గం వ్యతిరేకిస్తోంది.