సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరానన్న కారణంతో బీఆర్‌ఎస్ తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎస్సార్ గార్డెన్స్ పేరుతో ఫంక్షన్ హాల్‌ను తాను 13 ఏళ్ల క్రితం నిర్మించానని, అప్పుడు సర్వేలు చేయకుండా ఇప్పుడు తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నా రని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా మంగళవారం భారీ సంఖ్యలో కార్యక ర్తలతో కలిసి ఆయన గాంధీభవన్‌కు వచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. కొద్దిసేపు రేవంత్‌రెడ్డితో భేటీ అయిన పొంగులేటి తర్వాత మల్లు రవి, పిడమర్తి రవి, బానోతు విజయాబాయి, కోటూరి మానవతారాయ్ తదిత రులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.
కల్వకుంట్ల కుటుంబం రాజులా పాలిస్తోంది..
కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా తనకు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు పొంగులేటి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తాను 20 గుంటల భూమిని కబ్జా చేశానంటూ.. ఇప్పుడు సర్వేల పేరుతో బీఆర్‌ఎస్ తనకు నోటీసులు ఇప్పిస్తోందని తెలిపారు. తాను ఆ భూమిని కబ్జా చేశానంటే ఎవరూ నమ్మరని, దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని వివరించారు.
తాను భూమిని కబ్జా చేసినట్లు తేలితే ఆ భూమి మొత్తం రాసిస్తానని సవాల్ చేశారు. అయినా కబ్జాలకు పాల్పడడం బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు ఒకలా, కాంగ్రెస్‌లో చేరినప్పుడు మరోలా ఉంటుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం రాజులాగా పాలిస్తోందని, హామీలు ఇవ్వడం, పథకాలను ప్రారంభించడం తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు.
బీఆర్‌ఎస్ నేతలు అధికార మదంతో మాట్లాడుతున్నారని, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ ఉండేదని ప్రశ్నించారు. అయినా కేసీఆర్ ఒక్కడు దీక్ష చేస్తేనే రాష్ట్రం వచ్చిందా? అని నిలదీశారు. అనంతరం ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరిలను మర్యాదపూర్వకంగా కలిశారు.
వారిద్దరూ జోడెద్దుల్లాంటి వారు
పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమితులైన పొంగులేటికి రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మాజీ మంత్రి జూపల్లి కూడా కాంగ్రెస్‌లో చేరతారని, ఈ నెల 20న జరగాల్సిన ఆయన చేరిక సభ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నామని, ఈ నెలాఖరులోగా లక్షలాది మందితో నిర్వహించే సభలో జూపల్లి పార్టీలో చేరతారని చెప్పారు. పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్ పార్టీకి జోడెద్దుల్లాంటి వారని రేవంత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment