కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి | Priyanka Gandhi Fires On BRS Leaders KCR And KTR | Sakshi
Sakshi News home page

కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి

Published Mon, Nov 20 2023 4:23 AM | Last Updated on Mon, Nov 20 2023 4:23 AM

Priyanka Gandhi Fires On BRS Leaders KCR And KTR - Sakshi

ఆదివారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రియాంకా గాంధీ

నిర్మల్‌/సాక్షి, ఆసిఫాబాద్‌: ‘‘రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు (పదవులు) ఉన్నాయి. యువతకు ఉద్యోగాలు రావాలంటే.. కేసీఆర్, కేటీఆర్‌ల ఉద్యోగాలు ఊడగొట్టాలి. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి..’’అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పిలుపునిచ్చారు. ప్రజలు ఇప్పటికే రెండుసార్లు బీఆర్‌ఎస్‌కు ఓటేసి పదేళ్లు దగాపడ్డారని, మళ్లీ బీఆర్‌ఎస్‌కు వేస్తే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు.

ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే జాబ్‌ క్యాలెండర్‌ అమలు చేస్తామని, రెండులక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలన్నారు. ఆదివారం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. ఖానాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెడ్మ బొజ్జు పటేల్‌ను, ఆసిఫాబాద్‌లో అజ్మీరా శ్యాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. రెండు సభల్లో ప్రియాంకాగాంధీ ప్రసంగం ఆమె మాటల్లోనే.. 

‘‘ఇందిరాగాంధీ ఆదివాసీలు, గిరిజనుల గురించి ఆలోచించేవారు. వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొచ్చారు. అందుకే ఆమె మరణించి 40 ఏళ్లు గడిచినా గిరిజనులు ఆరాధిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తెలిసే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. కానీ కేసీఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలను దగా చేశారు. ప్రజల ఆకాంక్షలు ఒక్కటీ నెరవేర్చలేదు. యువతకు ఉపాధి కల్పించలేదు. 

కేసీఆర్‌ కుటుంబానికే ఉద్యోగాలు 
రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు రాకపోయినా కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు వచ్చాయి. పరీక్షలు నిర్వహించినా పేపర్‌ లీక్‌లు జరిగాయి. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి 2 లక్షల మందికి ఉద్యోగాలిస్తాం. ప్రత్యేక రాష్ట్రంలో తమ జీవితాలు మారుతాయని ఉద్యమకారులు కలలు కన్నారు. కానీ అలా జరగలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిస్తాం. ఈ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌లకు ఉద్యోగాలు ఇవ్వొద్దు. 

లక్షల కోట్ల దోపిడీ.. 
రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరిట రూ.లక్షల కోట్ల దోపిడీ జరిగింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడా వ్యాపారవేత్తలకు రుణమాఫీ చేసింది. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదు. ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అవినీతిపై చర్యలు చేపట్టరు. కానీ కాంగ్రెస్‌ నేతలపై మాత్రం సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే కాబట్టి అలా చేస్తున్నారు. వారికి ఒక తమ్ముడు ఎంఐఎం అధినేత.

కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు ఆయన సహకరిస్తున్నారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఇతర రాష్ట్రాల్లో 40, 50 స్థానాల్లో పోటీ చేస్తారు. తెలంగాణలో మాత్రం 9 స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు. కేసీఆర్‌ కర్ణాటక సర్కారుపై విమర్శలు చేస్తున్నారేగానీ.. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్నదేమిటనేది ప్రజలకు చెప్పారు. తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై కాంగ్రెస్‌కు ఒక విజన్‌ ఉంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి. 

ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తాం 
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తాం. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఖాతాలో వేస్తాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తాం. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం. రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తాం. వరి పంటకు బోనస్‌గా రూ.500 అందజేస్తాం. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు లేని వారికి ఇంటి స్థలంతోపాటు రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తాం..’’అని ప్రియాంకగాంధీ ప్రకటించారు. 

జీతేగా ఇండియా.. అంటూ.. 
క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో ఇండియా టీమ్‌ గెలవాలని కోరుకుందామని, జీతేగా ఇండియా అంటూ ఖానాపూర్‌ సభలో ప్రియాంకగాంధీ ప్రసంగాన్ని ప్రారంభించారు. సభికులతోనూ ‘జీతేగా ఇండియా..’అంటూ నినాదాలు చేయించారు. ఈ సభల కోసం ఢిల్లీ నుంచి విమానంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు వచ్చిన ప్రియాంక.. అక్కడి నుంచి మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌రావు చవాన్, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రేలతో కలసి హెలికాప్టర్‌లో ఖానాపూర్‌కు వచ్చారు. తర్వాత హెలికాప్టర్‌లోనే ఆసిఫాబాద్‌కు చేరుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement