సాక్షిప్రతినిధి,కాకినాడ: ‘ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా’ అనే సామెత తెలుగు తమ్ముళ్లకు నూరుశాతం వర్తిస్తుంది. ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో వీరిది అందె వేసిన చెయ్యి. పార్టీ అధినేత చంద్రబాబు దగ్గర నుంచి చోటామోటా నాయకుల వరకు అందరిదీ అదే తీరు. పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెంలో నిధుల స్వాహాకు టీడీపీ నేత కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు.
జిల్లాలో అతి పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో నిధులు కూడా పుష్కలమే. ఇక్కడ టీడీపీ కీలక నేతగా వ్యవహరిస్తోన్న వల్లూరి శ్రీనివాస్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్పకు ముఖ్య అనుచరుడు. 2017–2021 వరకు శ్రీనివాస్ భార్య శేషవేణి సర్పంచ్‌గా.. శ్రీనివాస్ ఉపసర్పంచ్‌గా పనిచేశారు. వీరి హయాంలో పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై నిధులను దోచేశారు.
కాగితాల్లోనే పనులు
వేట్లపాలెం పంచాయతీలో జనాభా 20 వేలపై చిలుకు ఉంటుంది. ఏటా జనరల్ ఫండ్ కూడా రూ.కోటి దాటేది. ఆర్థిక సంఘం నిధులు కూడా తోడయ్యాయి. ఇదే అదనుగా ఉన్న సిమెంట్ రోడ్లనే కొత్తగా వేసినట్టు, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేసినట్టు, డ్రైన్లలో పూడిక తీసినట్టు కాగితాల్లో చూపించారు. ఇంటి పన్ను, కుళాయి పన్నులు వసూలుచేసి జమచేయకుండానే నొక్కేశారు.
బ్లీచింగ్, ముగ్గు, చీపుర్లు కొనుగోలు చేయకుండానే ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించారు. ఇలా వారి హయాంలో ఐదారు కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. సర్పంచ్ శేషవేణి అయినా ఉప సర్పంచ్ హోదాలో ఆమె భర్త పెత్తనం చేసి ని«ధులు నొక్కేశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకుడు గోలి బాబ్జీ ఫిర్యాదుతో ఇక్కడి అవినీతి బయటపడింది. ఇక్కడ కొల్లగొట్టిన ప్రజాధనంతో అక్రమార్కులు కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఇవీ చర్యలు
విచారణ అనంతరం జీవీ రమణ సస్పెండయ్యారు. ఆయన తన హయాంలో జరిగిని అవినీతి సొమ్ము పంచాయతీకి జమ చేశారు. పీఎన్‌ఆర్ రాజేశ్వరరావు రిటైరయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేసేలా జిల్లా పంచాయతీ అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
పనులపై ఆరా
కాగితంపై సంతకాలు చేసి ఇచ్చే ఓచర్లు 79కి గాను 59 రికార్డుల నుంచి మాయమయ్యాయి. ఎస్సీ పేటలో ఇంటర్నల్ గ్రావెల్ రోడ్డు, జేసీబీతో పారిశుధ్య పనులు , కెనాల్‌రోడ్డులో గోదావరి కాలువ నుంచి చెరువులు నింపినట్టు, కన్నయ్యకాలనీలో ఇంటర్నల్ గ్రావెల్ రోడ్డు వేసినట్టు, సాయిబాబాగుడి నుంచి పంచాయతీ కార్యాలయం వరకు రక్షిత మంచినీటి పైపులైన్ తదితర పనులు చేసినట్టు చూపించి రూ.50లక్షలు పైనే పక్కదోవపట్టించారు.
వీటిలో ఏ ఒక్క పనినీ నగదు పుస్తకంలో నమోదు చేయలేదు. ఏ ఒక్క పనికి రికార్డులు కూడా లేవు. అసలు ఈ పనులు చేశారా లేదా అనే కోణంలో క్వాలిటీ కంట్రోల్ యంత్రాంగం ఆరా తీస్తోంది. ఈ రకంగా సర్పంచ్, ఆమె భర్త శ్రీనివాస్ హయాంలో రూ.4 కోట్ల వరకు అవినీతి జరిగినట్టు మధ్యంతర నివేదికలో నిర్థారించారు. ఈ వ్యవహారాల్లో బాధ్యులైన ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదుచేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది.
అధికారులూ భోక్తలే
♦ వేట్లపాలెం పంచాయతీలో అక్రమాలపై డీఎల్‌పీఓ వై అమ్మాజీ విచారణ నిర్వహించారు.
♦ పంచాయతీ జనరల్ నిధులు, ఇంటి పన్ను, ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లినట్టు ప్రాథమిక విచారణలో తేలింది.
♦ పంచాయతీ కార్యదర్శి జీవీ రమణ రూ.3.68 లక్షలు అవినీతికి పాల్పడ్డట్టు లెక్క తేలింది.
♦ పంచాయతీ కార్యదర్శి పీఎన్‌ఆర్ రాజేశ్వరరావు జనరల్ నిధుల నుంచి రూ.3.61లక్షలు, 14వ ఆర్ధిక సంఘం నిధులలో రూ.6.60లక్షలు కాజేరని బయటపడింది.
♦ పంచాయతీ సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీ సూర్యకళ ఇంటి పన్ను రూ.2.24 లక్షలు జమ చేయకుండా స్వాహా చేశారు.
♦ నాటి సర్పంచ్ శేషవేణి జనరల్ ఫండ్స్ రూ.3.61లక్షలు, 14 ఆర్థిక సంఘం నిధుల్లో రూ.6.62 లక్షలు దారి మళ్లించారు
♦ ఇలా పంచాయతీలో రూ.25 లక్షలు వరకు ప్రజాదనం దారి మళ్లినట్టుగా డీఆల్‌పీఓ తేల్చారు.
అవినీతి చిట్టా తిరగేస్తే..
ఏడెనిమిది కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగితే డీఎల్‌పీఓ మొక్కుబడిగా విచారించి అక్రమార్కుల కొమ్ము కాస్తున్నారని స్థానికులంటున్నారు. వీరు కొన్ని ఆధారాలతో తాజాగా కలెక్టర్ కృతికాశుక్లాకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి 2013 నుంచి రికార్డుల్ని నిశితంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని కాకినాడ రూరల్ డీఎల్‌డీఓ నారాయణమూర్తిని ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన శనివారం కలెక్టర్‌కు మధ్యంతర నివేదిక సమర్పించారు.
పునర్విచారణలో కీలక ఆధారాలు లభించినట్టు తెలిసింది. ఎడ్లబండి లేకుండానే ఎడ్లబండితో చెత్త సేకరించినట్టు రికార్డులు సృష్టించి లక్షలు కాజేశారని తేల్చారు. నకిలీ రశీదులతో కుళాయి, ఆస్తి పన్నులు సొమ్ము లక్షలు దిగమింశారు. పైపులైన్ వేయకుండానే వేసినట్టు, మంచినీటి ట్యాంకులు మరమ్మతుల పేరుతో రూ.2.64 కోట్లు కొట్టేశారని సమాచారం. ఉన్న సీసీ రోడ్లపై మరోసారి రోడ్లు వేసినట్టు చూపించి వరసుగా రూ.27.50 లక్షలు, రూ.17.50 లక్షలు, రూ.21 లక్షలు, రూ.26 లక్షలు, రూ.33.90 లక్షలు కాజేశారని భోగట్టా.
బాధ్యులపై క్రిమినల్ చర్యలు
వేట్లపాలెం గ్రామ పంచాయతీలో అక్రమాలు వాస్తవమేనని ప్రాథమిక విచారణలో తేలింది.సమగ్ర విచారణ జరుపుతున్నాం. మధ్యతర నివేదిక ప్రకారం ఇంతవరకు రూ.4 కోట్ల మేర అవినీతి జరిగింది. నాలుగైదు రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక వస్తుంది. పంచాయతీలో పలు పనులకు రికార్డులు కూడా లేవు. గత విచారణలో తేలిన దాని కంటే ఎక్కువగానే అక్కడ నిధులు దుర్వినియోగం జరిగినట్టు తాజాగా బహిర్గతమైంది. ఇందుకు బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. –కృతికాశుక్లా,కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment