మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మోపిదేవి
సాక్షి, అమరావతి: పురపాలక పదవుల కేటాయింపులో సామాజిక సమతుల్యతకే సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యమిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మునిసిపల్ చైర్మన్, నగర మేయర్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేయాలన్నదే సీఎం లక్ష్యమని తెలిపారు. వారికి నిజమైన సాధికారిత కల్పించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో సుదీర్ఘ కసరత్తు చేస్తున్న కారణంగానే జాబితా విడుదల ఆలస్యమైందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల.. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తిరుపతి ఎంపీగా పోటీ చేయనున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని మీడియాకు పరిచయం చేశారు. ఓ సాధారణ కార్యకర్తకు ఇంతటి ప్రాధాన్యం జగన్ మాత్రమే ఇవ్వగలరన్నారు. చంద్రబాబు మాదిరి ఓడిపోయే సీట్లు దళితులకు ఇవ్వకుండా, నూటికి నూరుపాళ్లు గెలిచే సీటునే కేటాయించారన్నారు. ఇంకా సజ్జల ఏమన్నారంటే..
మోసం చేసినందుకే చంద్రబాబుకు నోటీసులు
అమరావతిలో రాజధాని వస్తుందని తెలిసి దళితులను బెదిరించి.. వారి భూములను గత చంద్రబాబు ప్రభుత్వం, ఆయన మనుషులు ప్రలోభపెట్టి లాక్కున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అందుకే సీఐడీ నోటీసులిచ్చింది. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదు. సీఎం వైఎస్ జగన్‌కు అలాంటిదే ఉంటే రెండేళ్లుగా ఎందుకు ఊరుకుంటారు? ధర్మబద్ధంగా విచారణ జరిపించాలని జగన్ కోరుకుంటున్నారు. చంద్రబాబు సాకులు వెతుక్కోవడం మానేసి విచారణకు సహకరించాలి. నిజానిజాలేంటో చట్టమే తేలుస్తుంది.
నోటీసులు ఇచ్చినప్పటి నుంచి చంద్రబాబు, లోకేశ్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. భయంతోనో, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనో తెలియదు గానీ.. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. టీడీపీ.. మానవ హక్కుల కమిషన్ సభ్యుల ఎన్నికపైనా ఇష్టానుసారం మాట్లాడటం దారుణం. మైదుకూరు, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ల ఎన్నిక విషయంలో టాస్ వేయాల్సి రావచ్చు. ఓటర్ల తీర్పుకు అనుగుణంగానే వైఎస్సార్‌సీపీ వెళ్తుంది. టీడీపీ గతంలో చేసినట్టు అడ్డగోలుగా మేం వెళ్లం. వైఎస్సార్‌సీపీ దౌర్జన్యాలు చేసిందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. అదే నిజమైతే తాడిపత్రి, మైదుకూరు పోగొట్టుకుంటామా?
Comments
Please login to add a commentAdd a comment