కూటమి వస్తే రద్దు చేస్తామని మోదీతో చెప్పించగలవా బాబూ?
దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో ఈ చట్టం ఉంది
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోంది
అక్కడి ప్రజల భూములను ఎవరైనా దోచేశారా?
అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు
ప్రమాదకరమైతే శాసనసభలో టీడీపీ ఎందుకు మద్దతిచ్చింది?
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల ధ్వజం
సాక్షి, అమరావతి: కూటమి కట్టినా ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోవడంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చంద్రబాబు చెప్పించగలరా అని నిలదీశారు. కుట్రపూరితంగా చట్టంపై దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు.
నీతిఆయోగ్ ప్రతిపాదనతో కేంద్రం తెచ్చిన ఈ చట్టం 24 రాష్ట్రాల్లో అమల్లో ఉందని.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అమలవుతోందని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజల భూములను ఎవరైనా దోచేశారా అని ప్రశ్నించారు. పత్రికల్లో అసత్య ప్రకటనలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం ప్రమాదకరమైతే టీడీపీ శాసనసభల్లో ఎందుకు మద్దతిచ్చిందని నిలదీశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు చీడపురుగు..
ఉగ్రవాది కంటే ఘోరంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు విష ప్రచారానికి ఒడిగట్టారు. ఎన్నికలకు ముందే ఆయన ఎత్తిపోయారు. ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో సీఎం జగన్‌ను రాక్షసుడిగా చిత్రీకరిస్తున్నారు. 2019 జూలైలో శాసనసభలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లుకు టీడీపీ ఆమోదం తెలిపింది. ఆ రోజు 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. శాసన మండలిలో స్వయంగా చంద్రబాబు తనయుడు లోకేశ్ కూడా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ‘ల్యాండ్ టైట్లింగ్ బిల్లు’ అమల్లోకి వస్తే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో కూలంకషంగా వివరించారు (ఈ సందర్భంగా కేశవ్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు).
ఆ రోజు మద్దతు తెలిపిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వస్తే రద్దు చేస్తానని చెప్పడం సిగ్గుచేటు. రద్దు చేస్తానంటే కూటమి ఆమోదం ఉండాలి కదా? అది కూడా మోదీ, అమిత్‌షాతో చెప్పించకుండా ఉత్తుత్తి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ పోలింగ్‌కు ముందు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ దుష్ప్రచారంపై ఎన్నికల సంఘం సీఐడీని కేసు నమోదు చేయమని చెప్పాక కూడా ఇలాంటి ప్రకటనలను ఈసీ ఎలా అనుమతించింది? ఎన్నికల్లో ఎప్పుడూ సక్రమ మార్గంలో గెలవని చంద్రబాబు లాంటి చీడ పురుగుకు సమాజంలో ఉండే అర్హత లేదు.
ప్రజలు తనను నమ్మట్లేదని, సూపర్ సిక్స్ పని చేయట్లేదని ఆయన గ్రహించాడు. దీంతో ఓటమి భయంతో, దింపుడు కళ్లం ఆశతో దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నాడు. నిన్న మొన్నటి వరకు పింఛన్ అందకుండా అవ్వాతాతలను రోడ్లపైకి తీసుకొచ్చి బలితీసుకున్నాడు. మహిళలకు అందాల్సిన పథకాల నగదును జమ కాకుండా అడ్డుకున్నాడు. నేడు భూములు లాగేసుకుంటారంటూ సిగ్గూ శరం లేకుండా మాట్లాడుతున్నాడు.
రైతుల భూమికి ప్రభుత్వం గ్యారంటీ..
భూ దోపిడీకి కేరాఫ్ చంద్రబాబు. వెబ్‌ల్యాండ్ పేరుతో ఆయన చేసిన భూదోపిడీ, తీసుకొచ్చిన భూ తగాదాలు అన్నీఇన్నీకావు. చుక్కల భూముల పేరుతో ఎందరో భూ యజమానులను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. 22ఏలో పెట్టి.. డబ్బులు ఇస్తేవాటిని విడిపించే సంస్కృతిని తీసుకొచ్చారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక లక్షల ఎకరాల చుక్కలు, ఈనాం భూములకు విముక్తి కల్పించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. దాదాపు 120 ఏళ్ల కింద బ్రిటీష్ వాళ్లు సర్వే చేశారు. సీఎం జగన్ వచ్చిన తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టారు.
యజమానుల ఆధ్వర్యంలో భూమిని సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో జియో ట్యాగ్ చేస్తారు. తద్వారా తగాదాలు వచ్చే పరిస్థితి ఉండదు. డివిజన్, సబ్ డివిజన్లు కూడా సమగ్రంగా జరుగుతాయి. ఇవన్నీ పూర్తి చేశాక యజమానికి ప్రభుత్వం పూచీకత్తుతో, ఇన్సూరెన్స్ చేసి భూమికి భద్రత కల్పిస్తూ టైట్లింగ్ ఇస్తుంది. ఆ తర్వాత వేరొకరు ఆ భూమి తనదంటూ వచ్చినా టైట్లింగ్‌దారుడికి ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది. ఎవరైనా ఆస్తిని కొని నిశ్చింతగా ఉండొచ్చు.
సిగ్గు లేకుండా రాజకీయానికి వాడుకుంటున్నాడు..
దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ–స్టాంపు విధానాన్ని కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. ఈ–స్టాంపులను ట్యాంపర్ చేయడానికి ఉండదు. దీన్ని చంద్రబాబు హయాంలోనే 2016–17లో తీసుకొచ్చారు. అప్పట్లో తెల్గీ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం కూడా ఉందని తేలింది. ఈ ఏడాది జనవరి 8న నందమూరి బాలకృష్ణ విశాఖలో భూములు కొని 12న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఫిబ్రవరి 8న ఈ–స్టాంపుతో పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో భూమిని కొనుగోలు చేసి అదే నెల 12న రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఆ రిజిస్ట్రేషన్లకు విలువ లేకపోతే.. వారికిచ్చిన పత్రాలను చించేసి చంద్రబాబు తుడుచుకోవచ్చు కదా. మీ బావమరిది బాలకృష్ణ, దత్తపుత్రుడు పవన్ ఆస్తికి ఇప్పుడేమైనా అయ్యిందా? వాళ్ల స్థలాల్లో ఎవరైనా వెళ్లి జెండా పాతి నాది అంటే వదిలేస్తారా? వాస్తవానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017–18లో ఈ–స్టాంప్ ద్వారా 77 వేలకు పైగా ఆస్తుల క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు చేస్తే అది 2023–24కు వచ్చేసరికి ఏకంగా 62.93 లక్షలకు పెరిగింది (2016–17లో ప్రారంభమై నాటి నుంచి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆస్తులు కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ పత్రాల వరకు వీడియోలో చూపిస్తూ).
ఈ విధానంలో లోపాలు లేకపోవడంతోనే చాలా మంది ఈ–స్టాంప్‌ల ద్వారా క్రయవిక్రయాలు చేశారు. వాళ్లందరి భూములు సక్రమంగా ఉన్నాయి కదా! ఎలాగైనా అధికారంలోకి వచ్చేసి రామోజీరావు ప్రజల సొమ్ముతో తన అక్రమ వ్యాపారాలు చేసుకోవాలని, బాబు అమరావతిలో రూ.వేల కోట్లు దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment