
సాక్షి, అమరావతి: పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నారాయణ వ్యవహారం బయటకు వచ్చాక ఫలితాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా కఠినంగా పరీక్షలు నిర్వహించడం కూడా ఎక్కువ మంది పాస్ కాకపోవడానికి కారణమని చెప్పారు. అలాగే కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ తీసేయడం కూడా ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ఒక కారణమన్నారు.
ఈ మేరకు సజ్జల గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. పదో తరగతి ఫలితాలపై కోవిడ్ కూడా ప్రభావం చూపించిందని తెలిపారు. నారాయణ, చైతన్య వంటివి గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయడంతోపాటు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డాయన్నారు. అందుకే టీడీపీ ప్రభుత్వ హయాంలో 90 శాతం పైగా ఉత్తీర్ణత ఉండేదని చెప్పారు.
తాము పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరీక్షలు జరిపామా? లేదా అనేదే ముఖ్యమన్నారు. కోవిడ్‌తో రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడంతో విద్యార్థుల్లో స్ఫూర్తి తగ్గి ఉండొచ్చన్నారు. ఇంగ్లిష్ మీడియం వల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని చెప్పారు. పది ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇన్‌స్టెంట్, బెటర్‌మెంట్ పరీక్షలు పెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యశ్రీ బలోపేతం
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యల్లో డొల్లతనం బయటపడిందని సజ్జల అన్నారు. పథకాల్లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత అనేది చూడాలని హితవు పలికారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఆయుష్మాన్ భారత్ అనేది ఇప్పుడొచ్చిందన్నారు.
రాష్ట్రంలో కోట్లాది మందికి ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ వచ్చాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారన్నారు. బీజేపీ వస్తుందో, లేదో కానీ టీడీపీతో వెళ్లడం ఖాయమని పవన్ కల్యాణ్ మాటలను బట్టి అర్థమవుతోందని సజ్జల అన్నారు. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. తమకు పొత్తులపైన విశ్వాసం లేదని.. ప్రజలపైనే నమ్మకమని తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment