బీఆర్‌ఎస్‌పై మంత్రి సీతక్క ధ్వజం
మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.44 కోట్ల రుణాలు పంపిణీ
లక్డీకాపూల్: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలా మూసీనదిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాడుకోబోమని, దానిని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపజేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని హామీనిచ్చారు. ప్రగతిభవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మూసీ పరీవాహక ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
17 మూసీ పునరావాస మహిళా సంఘాలకు రూ.3.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని మలక్‌పేట్, కార్వాన్ ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ బలాల, కౌసర్ మొహియుద్దీన్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డిలతో కలసి మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ...ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ వంటి ప్రాంతాలు వరదల వల్ల నష్టపోయాయని, మూసీ మురికి నీటి కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ నీటిని తాగే స్థాయికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రక్షాళనలో జీహెచ్‌ఎంసీ పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజ్, మూసీ జేడీఎం గౌతమి, శ్రీనివాస్‌రెడ్డి, మూసీ ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment