హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉందన్నారు. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కామెంట్స్ చేశారు.
మంత్రి సీతక్క తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్ర ఉంది. రాజకీయ పార్టీ కుట్ర ఉందని మేము అనుమానిస్తున్నాం. కుట్ర వెనుక ఎవరు ఉన్నారనేది బయటపెడతాం. అన్ని అలజడుల వెనుక బీఆర్ఎస్ కుట్ర ఉంది. కుట్రదారుల వెనుక అధికారులు ఉంటే వారిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగిస్తామన్నారు. అన్ని ఘటనలపై పూర్తి వివరాలతో బయట పెడతాం అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ విషయంలో తలసానిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. దీంతో, మంత్రి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. దిలావార్పూర్ ఇథనాల్ కంపెనీకి అన్ని అనుమతులు బీఆర్ఎస్ హాయాంలోనే ఇచ్చారు. గత ప్రభుత్వం చేసిన తప్పును బీఆర్ఎస్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. పర్మిషన్ కాపీలో కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయి. ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్లుగా మాజీ మంత్రి తలసాని కొడుకు తలసాని సాయి ఉన్నాడు. దీని గురించి కేటీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు. దమ్ముంటే కేటీఆర్ దిలావార్పూర్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్లుగా కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారు.
విధ్వంసం సృష్టించడం.. ఆ తర్వాత శాంతిభద్రతలకు విఘాతం అని కేటీఆర్ టీం ప్రచారం చేస్తున్నారు. తలసాని శ్రీనివాస్ వియ్యంకుడు పుట్టా సుధాకర్ ఇథనాల్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నాడు. కేటీఆర్ నువ్వు దిలావార్పూర్ రావాలి.. నేను కూడా వస్తా.. తప్పెవరిదో తేల్చుదాం. అసైన్డ్ భూములను రియల్ ఎస్టేట్ చేసిన చరిత్ర కేటీఆర్ దే. కేటీఆర్ నీకు నిజంగా నీతి చర్చకు రావాలి. వచ్చే అసెంబ్లీలో ఇథనాల్ కంపెనీపై చర్చ పెడతాం. కేటీఆర్ మీ ప్రభుత్వంలో గురుకాలలో ఎంత మంది చనిపోయారో లెక్క చెప్పమంటావా?. మంత్రులు, అధికారులు అంతా గురుకులాలలో మంచి సౌకర్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. లగచర్లలో గ్రామ సభ జరుగుతుంది.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment