వదిలేశారు! | Strange situation in Hyderabad Lok Sabha segment | Sakshi
Sakshi News home page

వదిలేశారు!

Published Thu, May 9 2024 4:17 AM | Last Updated on Thu, May 9 2024 4:17 AM

Strange situation in Hyderabad Lok Sabha segment

హైదరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో విచిత్ర పరిస్థితి 

కన్నెత్తి చూడని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు 

అభ్యర్థుల ప్రచారం కూడా అంతంతే 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఊరంతా ఒక దారయితే ఉలిపి కట్టెది మరో దారి’ అన్నట్లు ఉంది హైదరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ రాజకీయ పరిస్థితి. అధికార పక్షం కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా హైదరాబాద్‌ సెగ్మెంట్‌ను గాలికి వదిలేశాయి. ప్రతీ లోక్‌సభ సీటును ప్రతిష్టాత్మకంగా భావించి..విజయబావుటా కోసం రాష్ట్ర రాజధాని నుంచి మారుమూల ఆదిలాబాద్‌ వరకు వెళ్లి ర్యాలీలు, రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు, బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పక్షాల ముఖ్య నేతలు మహానగరం నడిమధ్య ఉన్న హైదరాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్‌ వైపు మాత్రం కన్నెత్తి చూడటంలేదు.

ఎన్నికల ప్రచార గడువు ముగింపు మూడు రోజులున్నా.. ఆ రెండు పక్షాల అభ్యర్థుల ప్రచారం కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాస్తవంగా హైదరాబాద్‌ అంటే మజ్లిస్‌ కంచుకోట. ఇక్కడ గత పది పర్యాయాలుగా మజ్లిస్‌ వరుస విజయాలతో ఎదురులేని శక్తిగా తయారైంది.  ఫలితంగా ప్రతి ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు డిపాజిట్‌ కూడా దక్కని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా పక్షాలు హైదరాబాద్‌పై ఆశలు వదులుకున్నాయి.. 

రెండు పక్షాలదే జోరు.. 
హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మజ్లిస్, బీజేపీ పక్షాలదే జోరు సాగుతోంది. వాస్తవంగా మూడున్నర దశాబ్దాలుగా ఇక్కడ కేవలం ముస్లిం– హిందూ సామాజిక ఎజెండాలు మాత్రమే పనిచేస్తుండటంతో మజ్లిస్‌–బీజేపీ మధ్య పోరు కొనసాగుతూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే ఎన్నికల ప్రచారంలో మజ్లిస్, బీజేపీలు పోటాపోటీగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. 

మజ్లిస్‌ పక్షాన  సిట్టింగ్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆయన సోదరుడు, పార్టీ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ, పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహిస్తుండగా,  బీజేపీ పక్షాన ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు అగ్రనేతలు రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగ్‌లు నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత గల్లీ గల్లీ తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు 

అధికారంలో ఉన్నా... 
రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా కాంగ్రెస్‌ పార్టీ ప్రచారంలో వెనకబడినట్లే కన్పిస్తోంది. లోక్‌సభ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్టానం సైతం హైదరాబాద్‌ను పరిగణనలోకి తీసుకున్నట్లు కని్పంచడం లేదు. మొక్కుబడిగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు సమీర్‌ వలీవుల్లాను రంగంలోకి దింపి చేతులు దులుపుకొంది. నామినేషన్‌ కార్యక్రమం సైతం సాదాసీదాగా సాగింది. 

కేవలం మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాత్రమే పాల్గొన్నారు. ఇక ప్రచారం పర్వంలో అభ్యర్థి సమీర్‌ వలీవుల్లాతో పాటు స్థానిక నేతలకే పరిమితమైంది. ఇప్పటి వరకు పార్టీ అగ్రనేతలు ఎవరూ ప్రచారంలో పాల్గొనలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీచేసిన అభ్యర్థులు సైతం అంతంత మాత్రంగానే కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల గాం«దీభవన్‌లో జరిగిన సమావేశంలో కార్వాన్‌ నియోజకవర్గంలో ప్రచారం అంశంపై ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు. 

 వాస్తవంగా ఈ లోక్‌సభ నియోజకవర్గంలో ఆదిలో వరుసగా కాంగ్రెస్‌ హవా కొనసాగినా.. మజ్లిస్‌ శకం ప్రారంభంతో కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంక్‌ కనుమరుగైంది. అప్పటి నుంచి  కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మైత్రి బంధం కారణంగా మొక్కుబడిగా బరిలో దిగే అభ్యర్థికి కనీసం డిపాజిట్‌ దక్కని పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో సైతం అదే సీన్‌ పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 

పట్టని బీఆర్‌ఎస్‌ 
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ కనీసం పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా సత్తా చాటేందుకు అన్ని జిల్లాల్లోనూ బస్సు యాత్రలు, రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లతో హోరెత్తిస్తోంది. కానీ హైదరాబాద్‌ సెగ్మెంట్‌ను మాత్రం గాలికి వదిలేసింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు వంటి అగ్రనేతలు కనీసం కన్నెత్తి చూడక పోగా, లోక్‌సభ పరిధిలోనే నివాసం ఉండే మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ తదితరులు సైతం ప్రచారంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. 

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ముందుకు రాకపోవడంతో ప్రచారం మొక్కుబడిగా తయారైంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఇక్కడ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ నిలబడగా.. ఆయనే తన అనుచరులు, లోకల్‌ లీడర్లతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక బరిలో ఉన్న మిగతా చిన్నా చితక పార్టీలు, ఇండిపెండెంట్ల పరిస్థితి కూడా అదేవిధంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement