టీడీపీ మొసలి కన్నీరు: నాడు దాటవేత.. నేడు డ్రామా | TDP Leaders Political Drama In Prakasam District | Sakshi
Sakshi News home page

టీడీపీ మొసలి కన్నీరు: నాడు దాటవేత.. నేడు డ్రామా

Published Fri, Sep 17 2021 7:20 PM | Last Updated on Fri, Sep 17 2021 8:52 PM

TDP Leaders Political Drama In Prakasam District - Sakshi

జిల్లా టీడీపీ నేతలు రాజకీయ డ్రామాలతో అభాసుపాలవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తూ ఛీత్కారాలకు గురవుతున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిపైగానీ, రైతుల సంక్షేమంపైగానీ నాయకులు దృష్టిపెట్టలేదు. ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తుండటంపై రైతులు అసహ్యించుకుంటున్నారు.  ప్రస్తుతం రైతులు సుభిక్షంగా ఉండటం చూసి ఎక్కడ తమకు దూరమవుతారోనని టీడీపీ నేతలు చేస్తున్న డ్రామాలకు ప్రజా స్పందన కరువైంది. (చదవండి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధిపై కనీసం దృష్టి సారించని ఆ పార్టీ జిల్లా నాయకులు ప్రస్తుతం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందని గగ్గోలు పెడుతున్నారు. జిల్లాలో జరగాల్సిన అభివృద్ధిపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిందిపోయి డీఆర్సీ సమీక్ష సమావేశాలకు సైతం డుమ్మా కొట్టి లేఖాస్త్రాల డ్రామాలు ఆడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు సాగిన టీడీపీ పాలనలో జిల్లా అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా డిస్ట్రిక్ట్‌ డెవలెప్‌మెంట్‌ రివ్యూ కమిటీ (డీడీఆర్సీ) సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు.

ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చుని జిల్లా అభివృద్ధిపై సమీక్షించిన దాఖలాలు అంతకంటే లేవు. ఐదేళ్ల పాలనలో జిల్లాకు మొండిచేయి చూపారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదు. వెలిగొండ ప్రాజెక్టును ఆదాయవనరుగా మార్చుకుని చంద్రబాబు బినామీ అయిన సీఎం రమేష్‌కు టన్నెల్‌ కాంట్రాక్ట్‌ను నామినేషన్‌ పద్ధతిపై కేటాయించి దోచుకున్నారు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది శూన్యం. ఒక్క ప్రాజెక్టు అంటే ఒక్క ప్రాజెక్టును కూడా జిల్లాకు తీసుకురాలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రామాయపట్నం పోర్టు అంటూ ఒక పైలాన్‌ నిర్మించి, పేపర్‌ మిల్లు అని ఫొటోలకు ఫోజులిచ్చి వెళ్లిపోయారు.

28 నెలల్లో 5 డీఆర్సీలు... 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన గడిచిన 28 నెలల కాలంలో ఐదు డీడీఆర్సీ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు జిల్లాలోని వైఎస్సార్‌ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తూ వస్తున్నారు. 2019 మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మొదటి సారిగా 2019 నవంబర్‌ 20న మొదటి డీడీఆర్సీ నిర్వహించారు. రెండోది 2020 ఫిబ్రవరి 29న, మూడోది 2020 అక్టోబర్‌ 15న, నాలుగోది 2021 మే 28న, ఐదవది 2021 సెప్టెంబర్‌ 15న వరుసగా నిర్వహిస్తూ వస్తున్నారు. 

డీఆర్సీలకు టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా... 
జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిన ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మొహం చాటేస్తున్నారు. డీఆర్సీ సమావేశాలకు కచ్చితంగా హాజరై వారి వాణి వినిపించాలి. ప్రజల ఇబ్బందులు, నష్టాలపై ప్రశ్నించాలి. అవన్నీ వదిలేసి జిల్లాలో ఉన్న టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీడీఆర్సీ సమావేశాలకు రావడమే మానుకున్నారు. ఒక్క సమావేశానికి మాత్రం కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అభివృద్ధిపై నిర్మాణాత్మక పాత్ర పోషించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

రైతు కోసం దీక్ష అని హైడ్రామా...  
అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిండా ముంచిన టీడీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. అప్పుడు అసలు పట్టించుకోని టీడీపీ నేతలను ఓడిపోయాక ఇప్పుడు రైతులు గుర్తుకొచ్చారంటూ జనం చీవాట్లు పెడుతున్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో రైతులు అప్పుల్లో కునారిల్లారు. రైతులకు రుణమాఫీ మొదలు, 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్, మద్దతు ధరలు, ఇతర రైతు సంక్షేమ పథకాలను విస్మరించిన అప్పటి సీఎం చంద్రబాబును నిలదీయని నేతలు.. ప్రస్తుతం రైతు కోసం అంటూ నిరసనలు చేపట్టడాన్ని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారు.

చదవండి:
వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement