తూర్పుగోదావరి జిల్లా రామవరంలో టీడీపీ నేత నల్లమిల్లి నివాసం వద్ద టీడీపీ ప్రచార సామగ్రి తగలబెడుతున్న ఆ పార్టీ కార్యకర్తలు
స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి సీనియర్లు?
దూపురం ఎంపీగా పరిపూర్ణానందస్వామి పోటీ?
రాప్తాడు బరిలో నిలిచేందుకు వరదాపురం సూరి సన్నాహాలు
కదిరిలో కూటమికి దూరంగా విష్ణువర్థన్‌రెడ్డి వర్గం
ధర్మవరంలో సత్యకుమార్‌కు పరిటాల శ్రీరామ్‌కు మధ్య దూరం
పుట్టపర్తిలో కనిపించని ‘గ్లాసు’, ‘కమలం
సాక్షి, పుట్టపర్తి: జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్ పెట్టాలని టీడీపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. మరోవైపు.. తమకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని జనసేన కార్యకర్తలూ అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా పార్టీల పెద్దలు కలుసుకునేందుకు మాత్రమే కూటమి వేదికగా మారినట్లు స్పష్టమవుతుండగా క్షేత్రస్థాయిలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. కూటమిలో టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఎవరికి వారు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీసత్యసాయి జిల్లాలోని హిందూపురం పార్లమెంటు సీటుతో పాటు ధర్మవరం, కదిరి, పుట్టపర్తి, రాప్తాడులో వేరు కుంపట్లు ఉంటాయని చెబుతున్నారు. మూడు పార్టీల నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారుగా పోటీచేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
రాప్తాడు నుంచి వరదాపురం సూరి?
బీజేపీ తరఫున ధర్మవరం టికెట్ ఆశించిన వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ)కి కూడా నిరాశే ఎదురైంది. బీజేపీ అధిష్టానం ధర్మవరం టికెట్‌ను వై. సత్యకుమార్‌కు ఖరారు చేసింది. దీని వెనుక పరిటాల శ్రీరామ్ హస్తం ఉందని భావిస్తున్న సూరి తనకు టికెట్ రాకుండా టీడీపీ అధిష్టానం వద్ద అడ్డుపుల్లలు వేసిన పరిటాల కుటుంబ సభ్యులను ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి.. పరిటాల సునీతను ఓడించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
‘స్వతంత్రం’గా పరిపూర్ణానందస్వామి..
హిందూపురం ఎంపీగా బీజేపీ తరఫున పోటీచేస్తానని రెండు నెలలుగా పరిపూర్ణానందస్వామి ప్రచారం చేసుకున్నారు. అయితే, కూటమిలో భాగంగా టీడీపీ నేత బీకే పార్థసారథికి ఆ ఎంపీ టికెట్ ఖరారుచేశారు. కానీ, పరిపూర్ణానందస్వామి తగ్గే పరిస్థితి కనిపించడంలేదు. తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని.. కార్యకర్తలు అందరూ సహకరించాలని ఆయన కోరుతున్నారు. టీడీపీ–జనసేన తనను మోసం చేశాయని ఆయన మండిపడుతున్నారు.
ప్రచారానికి శ్రీరామ్ దూరం?
ధర్మవరం టీడీపీ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ తరఫున ప్రచారం చేసేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. రాప్తాడులో పరిటాల సునీత గెలుపు కోసం బిజీబిజీగా గడపాల్సి ఉందని.. ఇతర పార్టీ నేతల గెలుపు కోసం తానెందుకు సమయం వృథా చేసుకోవాలని తన అనుచరుల వద్ద శ్రీరామ్ చర్చించినట్లు సమాచారం. అలాగే.. జనసేన నేత చిలకం మధుసూదన్‌రెడ్డి కూడా సత్యకుమార్‌కు మద్దతిచ్చే పరిస్థితి కనిపించలేదు.
కదిరిలో అంటీముట్టనట్లుగా విష్ణు..
ఇక కూటమి నిర్ణయాలు తనను నిరాశపరిచాయని కదిరి బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి తన అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. రానున్న ఎన్నికల్లో కదిరిలో టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేయకపోవచ్చని సమాచారం. కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లి.. అక్కడ బీజేపీ పార్లమెంటు అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
పుట్టపర్తిలో టీడీపీకి సహాయ నిరాకరణ..
కలిసి పోటీచేయాలన్న లక్ష్యంతో టీడీపీ–బీజేపీ –జనసేన కూటమిగా ఏర్పడినా.. పుట్టపర్తిలో మాత్రం ఆ దిశగా ఆయా నాయకులు ముందుకెళ్లడంలేదు. అక్కడ జనసేన నాయకుల అడ్రస్‌లేదు. బీజేపీ నేతలు ఎక్కడ ఉన్నారో కనిపించని పరిస్థితి. కేవలం టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. అనంతపురం నుంచి ఉద్యోగం మాదిరిగా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్తున్నట్లు ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment