సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అవతరణ సమయంలో తెలంగాణ అత్యంత సంక్లిష్ట పరిస్థితిలో ఉండేదని, ఆర్థికవేత్తల సాయంతో రాష్ట్ర పరిస్థితిపై లోతుగా మదింపు చేసుకుని ప్రయాణాన్ని ప్రారంభించా మని భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలలో చేర్చిన హామీలు కేవలం పది శాతమేనని.. ప్రజల అవసరాలు, స్వీయ అనుభవం ఆధారంగా మరో 90% కొత్త పథకాలను అమలు చేశామన్నారు. కేసీఆర్ ఆదివారం తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసి మాట్లాడారు.
రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పెంచాలన్నదే తమ విధానమని.. మళ్లీ అధికారంలోకి వచి్చన ఆరు నెలల్లోనే హామీ లన్నింటినీ అమలు చేస్తా మని ప్రకటించారు. గతంలో మేనిఫెస్టో చెప్పినవీ, చెప్పనివీ కలిపి 99.9 % హామీలను నెరవేర్చామని చెప్పారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేశామన్నారు. దళిత బంధు ద్వారా రూ.10 లక్షల ఆర్థిక సాయం, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా మార్చడం, పోడు భూముల పట్టాలు, గిరిజనులకు పదిశాతం రిజర్వేషన్లు వంటివి అమలు చేశామన్నారు.
బీసీ వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిన బీసీ బంధు వంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. చేపలు, గొర్రెల పెంపకంలో తెలంగాణ నంబర్ వన్ స్థానానికి ఎదిగిందన్నారు. ఉత్తమ వ్యవసాయ, తాగునీరు, విద్యుత్, సాగునీరు, దళిత, సంక్షేమ, విద్య, ఆరోగ్య, పారిశ్రామిక, గృహ నిర్మాణ పాలసీలను రూపొందించుకున్నామని చెప్పారు. వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా ఎదిగామని పేర్కొన్నారు. ప్రస్తుత విధానాలను కొనసాగిస్తూనే ‘సందర్భోచిత ఉద్దీపన’తో ముందుకు సాగుతామని ప్రకటించారు.
ఏపీలో పెన్షన్ల తీరు బాగుంది
ప్రస్తుతం తెలంగాణలో ఇస్తున్న ఆసరా పెన్షన్ రూ.2,016ను దశల వారీగా పెంచి రూ.5 వేలకు చేర్చుతామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెన్షన్ల తీరు బాగుందన్నారు. పేదలకు పెన్షన్‌ను క్రమంగా పెంచుతూ ప్రతీ నెలా రూ.3 వేల చొప్పు న అందించే పథకాన్ని ఏపీ విజయవంతంగా అమలు చేస్తోందని కితాబునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment