మూడు ఎనిమిది అయ్యింది. నాలుగు రెట్టింపయ్యింది. తెలంగాణ లోక్‌సభ ఫలితాల్లో 8 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. మరోవైపు బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాల్లో ఆద్యంతం అధికార కాంగ్రెస్‌తోనే కాషాయం పార్టీకి పోటీ నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీది ఘోరమైన పరిస్థితి. మెదక్ సీటులో.. అదీ కొద్దిసేపు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోయినట్లు కనిపించినా ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం స్ఫూర్తితో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను మాత్రమే గెల్చుకున్న హస్తం పార్టీ.. ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాల్లో, అదీ భారీ మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించుకోలిగింది. ఇక గులాబీ పార్టీ తొమ్మిది నుంచి జీరోకి పడిపోయి ఘోరమైన ఫలితం చవిచూసింది. బీఆర్‌ఎస్ నుంచి ఐదు స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోగా.. మిగిలిన నాలిగింటిని బీజేపీ దక్కించుకుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది.
👉 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ పార్టీలో నాయకత్వ లోపం కనిపించింది. కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని విమర్శల పర్వమే కొనసాగింది తప్ప కేడర్‌ను బలపర్చుకోవాలనే ప్రయత్నమూ కనిపించలేదు.
👉 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పైనే బీఆర్‌ఎస్ విమర్శలు కనిపించాయి. బీజేపీపై అసలు విమర్శలు గుప్పించకపోవడం కూడా మైనస్ అయ్యింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్.. తదనంతర పరిణామాల నడుమ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్‌ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. అంతేకాదు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.
👉 సరిగ్గా ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌కు జంప్ జిలానీలు తలపోటుగా పరిణమించారు. దీంతో.. బీఆర్‌ఎస్‌కు సరైన అభ్యర్థితత్వమే లేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్‌కు, అటు బీజేపీకి ఈ అంశం బాగా కలిసొచ్చాయి.
లోక్‌సభ ఎన్నికల్లో పడిపోయిన బీఆర్‌ఎస్ ఓట్ల శాతం
బీఆర్‌ఎస్‌కు 16.70 శాతం ఓట్లు
కాంగ్రెస్‌కు 40.11 శాతం ఓట్లు
బీజేపీకి 35.01 శాతం ఓట్లు
బీజేపీ కన్నా ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment