కాసర్లపహాడ్‌లో మహిళలతో షర్మిల
అర్వపల్లి: సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో రూ.4లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చారని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలానికి గురువారం పాదయాత్ర చేరింది. ఈ సందర్భంగా కొమ్మాలలో జరిగిన మాటాముచ్చట కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. బంగారు తెలంగాణ తెస్తానని చెప్పిన కేసీఆర్ రాష్ట్రాన్ని బీరు, బార్ల తెలంగాణగా మార్చారని ధ్వజమెత్తారు.
ప్రభుత్వం తెచ్చిన అప్పులతో ప్రతి కుటుంబంపై రూ.4 లక్షల భారం పడుతుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పులు, ఆత్మహత్యల తెలంగాణగా మారిందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో రాష్ట్రం లో 46 లక్షల పక్కా ఇళ్లు నిర్మిస్తే, కేసీఆర్ ఒక్క ఇంటిని కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ఉద్యమకారుడని కేసీఆర్‌కు అవకాశమిస్తే దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుంచి స్థానికుడైన వైఎస్సార్‌టీపీ అభ్యర్థి ఏపూరి సోమన్నను ఆదరించి గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment