సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల నుంచే కాకుండా.. మిత్ర కూటమి ఇండియా(INDIA) కూటమిలో కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి.
తాజాగా.. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ఒకరు ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తన వద్దకు తీసుకువస్తే రూ.10కోట్ల నగదు బహుమతి ఇస్తానని ఉత్తరప్రదేశ్ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఒకవేళ ఎవరూ సాహసించక పోతే.. తానే అతన్ని కనిపెట్టి మరీ చంపేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే.. ఆచార్య తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు. బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని ఆయన పేర్కొన్నారు(సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కార్యకర్తలు ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.). రూ.10 కోట్లు ఎందుకని.. తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలికగా చెప్పారు.
మళ్లీ అదే చెబుతున్నా..
సనాతన ధర్మ మలేరియా, డెంగ్యూలాంటిదని.. దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, హిందూ సంఘాలు ఉదయ్‌నిధికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడంతో పాటు పలుచోట్ల ఫిర్యాదులు చేశాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ రవిని కలిసి.. మంత్రి ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అయితే..
ఉదయ్‌నిధి స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మళ్లీ అదే చెబుతున్నా.. మళ్లీ అదే చెబుతా కూడా అంటూ వ్యాఖ్యానించారు. ‘‘సనాతన ధర్మం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాను. నేను ఏదైతే మాట్లాడానో.. అదే పదే పదే చెబుతాను నేను హిందూమతాన్నే కాదు అన్ని మతాలను కలుపుకుని.. కులవిభేదాల్ని ఖండిస్తూ మాట్లాడాను, అంతే’’ అని చెన్నై కార్యక్రమంలో పేర్కొన్నారాయన. ప్రతిపక్షాల ఐక్యతపై భయపడి.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోంది. వాళ్లు నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఉదయ్‌నిధి స్టాలిన్ మండిపడ్డారు. ఉదయ్‌నిధి హిట్లర్ అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ, మరోవైపు మిత్రపక్ష ఇండియా కూటమిలోనూ ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. ఉదయ్‌నిధి స్టాలిన్ ఇలా తన వ్యాఖ్యలపై దిద్దుబాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment