మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీఎం కేసీఆర్‌కు ప్రజల సంక్షేమం, అభివృద్ధి అవసరం లేదని.. తాను, తన కొడుకు, తన కుటుంబ ప్రయోజనాలే లక్ష్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం తెలంగాణకు తొమ్మిదేళ్లలో రూ.9 లక్షల కోట్లు ఇస్తే.. ‘మాకేం ఇచ్చారు? మా కుటుంబానికి ఏం ఇచ్చారు? మా ఫామ్‌హౌస్‌కు ఏమిచ్చారని అడుగుతున్నారు’ అని పేర్కొన్నారు. కేసీఆర్ నిజాంలా, రజాకార్లలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ పాలమూరు ప్రజాగర్జన సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం రూ.9 లక్షల కోట్లు ఇస్తే.. కేసీఆర్ మాత్రం ఇచ్చి న హామీలేమీ అమలు చేయలేదు. దళిత సీఎం, డబుల్ బెడ్రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి వంటివేమీ ఇవ్వలేదు. అనేక పోరాటాలు, 1,200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇప్పుడు ఎలాంటి దుస్థితిలో ఉన్నదో చూస్తున్నాం. దేశంలో సిద్ధాంతపరంగా విభేదించే సీఎంలు ఉన్నారుగానీ.. తెలంగాణ సీఎంలా ఎవరూ లేరు.
తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రధాని వస్తే.. రాష్ట్ర సీఎం మాత్రం రారు. ఫామ్‌హౌజ్‌లో ఉంటారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతాయి. పనులు ప్రగతిభవన్ దాటవు. గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగరవేసి కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పంపిస్తాం. ప్రజలకు నీతివంతమైన, పురోగామి పాలన అందేందుకు బీజేపీని ఆదరించాలి. మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి.
వారు మజ్లిస్ తొత్తులు
తాను ఉన్నానంటూ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ముందుకు వస్తోంది. గతంలోనే వారి పాలన చూశాం. అవినీతి, కుటుంబ పార్టీ గురించి మనకు తెలుసు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ, అవినీతి పార్టీలే. రెండూ మజ్లిస్ పార్టీకి తొత్తులే. వారికి గురువు అసదుద్దీన్ ఒవైసీ. ఈ మూడింటి డీఎన్‌ఏ ఒక్కటే.. వీటిలో ఏ పార్టీకి వేసినా మరొకరికి వేసినట్టే.
ప్రధానికి ధన్యవాదాలు చెప్తున్నా..
సమ్మక్క–సారలమ్మ పేరిట కేంద్రీయ గిరిజన వర్సిటీ ఏర్పాటు ఎంతో గొప్ప విషయం. పసుపు బోర్డు కావాలని రైతులు ఎన్నో ఏళ్లు ఉద్యమాలు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు. వీటిపై తెలంగాణ ప్రజల తరఫున నేను ప్రధానికి ధన్యవాదాలు చెప్తున్నా..’’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాష్ట్ర సీనియర్ నేతలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, ఏవీఎన్ రెడ్డి, మురళీధర్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, గరికపాటి మోహన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టి.ఆచారి, డి.ప్రదీప్‌రావు, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు, చిత్తరంజన్‌దాస్ పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రజలను ఏడిపిస్తున్నారు: జితేందర్‌రెడ్డి
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తూ ఏడిపిస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గపభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ఆరోపించారు. పాలమూరు సభలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా రైల్వేస్టేషన్‌కు ఎన్నోఏళ్ల తర్వాత మోదీ చొరవతో మోక్షం లభించిందని పేర్కొన్నారు. పాలమూరులో రూ.13,500 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
చిన్న ట్రైలర్‌కే వణికితే.. రిలీజైతే ఏమిటో?
పాలమూరులో మోదీ సభకు వచ్చి న అద్భుత ప్రజా స్పందన చూసి కల్వకుంట్ల కుటుంబం ఆగమాగం అవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సభ అనంతరం ఆదివారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్రధాని అన్నది ఫాంహౌస్‌కుటుంబాన్నే. అది అర్థంకానట్టు కేటీఆర్ నటించడం నవ్వు తెప్పిస్తోంది. చిన్న ట్రైలర్‌కే గజగజ వణికిపోతుంటే.. రేపు సినిమా రిలీజైతే మీ పరిస్థితేమిటో..’’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment