
సాక్షి, విజయనగరం: జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. టీడీజీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మీసాల గీత మరలా తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం అని బోర్డు తగిలించారు. కాగా, అశోక్ గజపతిరాజు, మీసాల గీత మధ్య టీడీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పార్టీ కార్యాలయాన్ని ఎత్తేయాలని ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
ఈక్రమంలో అశోక్ వర్గానికి వ్యతిరేకంగా వారం రోజుల క్రితం ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో గీతపై అశోక్ వర్గం అమరావతిలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతిరాజు బంగ్లాకు బదులు కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు. అధిష్టానం హామీ మేరకు ఆమె బోర్డు తొలగించి వారం గడుస్తున్నా.. నూతన కార్యాలయం ఏర్పాటు జరగలేదు. అధిష్టానం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఆమె మరోమారు తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం బోర్డును ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది.
(చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ )
Comments
Please login to add a commentAdd a comment