సాక్షి, తాడేపల్లి: విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగితే కూటమి ప్రభుత్వం కనీసం స్పందించ లేదన్నారు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. అలాగే, విగ్రహం వద్ద దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కాగా, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి తెలియదా?. విగ్రహం దాడిపై టీడీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి దుండగులు దాడి చేశారన్నారు. ఇంకో సారి ఏపీ ఐఐసి వాళ్ళు వచ్చారు అన్నారు. మరోసారి వైఎస్ జగన్ అంటే గిట్టని దళితులు ఎవరో చేశారని అంటున్నారు. అసలు దాడి చేసింది ఎవరైనా తేల్చాల్సిందే ప్రభుత్వ మే కదా?. అంత మంది వచ్చి దాడి చేస్తుంటే పోలీసులకు తెలియలేదా?. విగ్రహం వద్ద రాత్రి సమయంలో లైట్లు ఆర్పేస్తే ఎందుకు సిబ్బందిని విచారించలేదు. పోలీసులు కూడా అక్కడే ఉన్నారని అంటున్నారు. ఒకవేళ పోలీసులు లేకపోతే ఎందుకు ఇప్పటివరకు ఎవ్వరినీ విచారించలేదు. పోలీస్ కమిషనర్ ఆఫీస్ పక్కనే ఉన్న అంబేద్కర్ స్మృతివనంపై జరుగుతున్న దాడి కనిపించలేదా?. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్‌పైనా, ఆయన భావజాలంపైనా చంద్రబాబుకు గౌరవం లేదు. అందుకే ఈ దాడి జరిగినా కనీసం స్పందించలేదు.
స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం పెట్టడం సీఎం చంద్రబాబుకి ఇష్టం లేదు. ఆయన అమరావతిలో పెడతాను అన్నారు తప్ప అక్కడ పెట్టలేదు. స్వరాజ్య మైదానాన్ని గతంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి చంద్రబాబు లబ్ది పొందాలని చూశారు. గతంలోనే అక్కడ ప్రజలు ఆందోళన చేస్తే చంద్రబాబు వెనక్కి తగ్గారు. అంబేద్కర్ స్మృతి వనానికి రక్షణ లేకపోవడం దారుణం. అంబేద్కర్‌ను గుర్తు చేసుకునేలా చంద్రబాబు ఏనాడైనా ఒక్క పని చేశారా?. చంద్రబాబు ఏనాడైనా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లారా?. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర. టీడీపీ నేతలే అరాచక మూకలని పంపారు. అంబేద్కర్ స్మృతి వనం తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టే కుట్ర ఉంది. అందులో భాగంగానే ఈ దాడికి పాల్పడ్డారని భావిస్తున్నాం. వాళ్లే ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment