సాక్షి, విశాఖపట్నం: దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తిరుమల లడ్డూ వివాదంలో విచారణ చేసి నిజాలు తేల్చాలి. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్సీ బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు విష ప్రచారం చేస్తున్నారు. దేవుడి మహా ప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్దతి కాదు. దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు చేయడం ఎందుకు?. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణ చేయించండి. విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయండి.
కొన్ని పత్రికలు తప్పుగా వార్తలు రాస్తున్నాయి. ఇంతటితో ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు, పత్రికలు ఆపాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, టీటీడీ ఈవో మాటలకు మధ్య పొంతనలేదు. కేంద్రంలో, రాష్ట్రంలో మీరే కదా అధికారంలో ఉన్నారు. తిరుమల లడ్డూ విషయంపై విచారణ చేసి నిజాలు తేల్చండి. విచారణలో తప్పుచేసినట్టు తేలితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మనోభావాలతో ఆడుకుంటోంది. లడ్డూ ప్రసాదం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడినది. దైవ ప్రసాదంపై చంద్రబాబు ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం.
నెయ్యి వస్తే టీటీడీ టెస్టులు చేసిన తరువాతే ప్రసాదానికి తీసుకుంటుంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తుంది. ప్రపంచంలోనే కోట్లాది మంది భక్తులు వేంకటేశ్వర స్వామికి ఉన్నారు. అటువంటి దేవుని ప్రసాదంపై రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు. వాస్తవాలను పక్కన పెట్టి వైఎస్సార్‌సీపీపై బురదజల్లడం ఎంత వరకు న్యాయం. మీ రాజకీయాల కోసం దేవుడిని బయటకు తీసుకువస్తారా?. కృష్ణారావు లాంటి వారు ప్రసాదంలో తప్పు జరగలేదని చెప్పారు. జరిగితే వారిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అది నిరూపించ లేకపోతే చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. కృష్ణారావు మాటలతో నేను ఏకీభవిస్తున్నాను.
రాష్ట్రంలోని సమస్యలను డైవర్ట్ చేసేందుకే కుట్ర రాజకీయం చేస్తున్నారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో బడ్జెట్ ఎందుకు పెట్టలేదు?. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చారా?. సూపర్ సిక్స్‌లో ఎన్ని హామీలు అమలు చేశారు. ఎంత మంది తల్లికి వందనం ఇచ్చారు. ఎంత మంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారు. మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకు చూస్తున్నారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజంగా చెప్పండి. మీరు చెప్పక పోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసు. మూడు రోజుల పాటు తిండి నీళ్ళు లేక చనిపోయిన ఘటన దేశంలో ఎక్కడ జరగలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందిని చంపారో చెప్పండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: బాబు గారూ.. మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి!
Comments
Please login to add a commentAdd a comment