టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేలో వెల్లడి
21–22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం
3–4 ఎంపీ సీట్లకే టీడీపీ–జనసేన కూటమి పరిమితం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని టౌమ్స్ నౌ – ఈటీజీ రీసెర్చ్ సర్వే తేల్చి చెప్పింది. వైఎస్సార్ సీపీ 49 శాతం ఓట్లతో 21 నుంచి 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని ఘనవిజయం సాధిస్తుందని వెల్లడించింది. టీడీపీ – జనసేన కూటమి 45 శాతం ఓట్లతో 3 నుంచి 4 లోక్‌సభ స్థానాలకే పరిమితం కానుందని తేల్చింది. బీజేపీ 2 శాతం ఓట్లు, కాంగ్రెస్, వామపక్షాలు తదితరులు 4 శాతం ఓట్లు దక్కించుకుంటాయని అంచనా వేసింది.
జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ లాంటి డజనుకుపైగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలు సైతం సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ఘనవిజయం సాధించడం ఖాయమని ఇప్పటికే తేల్చాయి. టీడీపీ – జనసేన పొత్తు కుదిరాక గతేడాది డిసెంబర్ 13 నుంచి ఈనెల 7 వరకూ రాష్ట్రంలో వివిధ వర్గాలకు చెందిన 3,23,257 మంది అభిప్రాయాలను సేకరించి సర్వే ఫలితాలను రూపొందించినట్లు టైమ్స్‌నౌ – ఈటీజీ సర్వేను శుక్రవారం టైమ్స్‌నౌ ఛానెల్‌లో సమర్పించిన సంస్థ సీనియర్ న్యూస్ ఎడిటర్ పద్మజా జోషి వెల్లడించారు.
ఆ అభిప్రాయాలను క్రోడీకరిస్తే వైఎస్సార్‌సీపీ సంచలన విజయం సాధించడం ఖాయమని తేలిందన్నారు. టీడీపీ–జనసేన పచ్చి అవకాశవాదంతో పొత్తు పెట్టుకున్నాయని అధిక శాతం ప్రజలు తమ అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు తెలిపారు. హామీల్లో 99 శాతం అమలు, సుపరిపాలన ద్వారా సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయత చాటుకున్నారని, వైఎస్సార్‌సీపీ ఘనవిజయానికి ఇదే బాటలు వేస్తున్నట్లు తాము నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment