
కామారెడ్డి జిల్లా ముస్తాపూర్‌లో మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల
లింగంపేట: తెలంగాణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన రావాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆకాంక్షించారు. ఆదివారం ఆమె కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి, లింగంపేట మండలాల్లో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేశారు. లింగంపేటలో ‘మాటా–ముచ్చట’ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్సార్ విద్యుత్, బస్సు చార్జీలు పెంచకుండా పాలించారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫామ్‌హౌస్‌లో కాలం గడపడం తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదన్నారు. కళ్లముందే రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా కనిపిస్తున్నా సీఎం కేసీఆర్ వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఉసురుపోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు ఆటోలు, రిక్షాలు నడుపుకుంటున్నారని, ఇదేనా బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. తనను ఆశీర్వదిస్తే రాజశేఖరరెడ్డి పేరు నిలబెడతానని, ఆయన సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తానని హామీనిచ్చారు. పాదయాత్రలో వైఎస్సార్‌టీపీ అధికార ప్రతినిధి రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.