కట్టుదిట్టంగా పది పరీక్షలు | Sakshi
Sakshi News home page

కట్టుదిట్టంగా పది పరీక్షలు

Published Mon, Apr 3 2023 1:44 AM

ఎస్పీ మలికా గర్గ్‌   - Sakshi

ఒంగోలు టౌన్‌: నేటి నుంచి ఈనెల 18వ తేది వరకు జరిగే పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్‌ తెలిపారు. ఈమేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు నిర్వహించే పదవ తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఒంగోలు సబ్‌ డివిజన్‌కు అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, మార్కాపురం, దర్శి డివిజన్‌లకు ఏఎస్పీ (క్రైమ్‌) యస్‌వీ శ్రీధరరావు, కనిగిరి సబ్‌ డివిజన్‌కు ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ అశోక్‌ బాబులను ఇన్‌చార్జులుగా నియమించినట్లు తెలిపారు. పరీక్ష పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూంల వద్ద సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొని వచ్చేటప్పుడు, పరీక్ష అయిపోయాక సమాధాన పత్రాలు తీసుకెళ్లే సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున కేంద్రాల వద్ద బయట వ్యక్తులు ఉండకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని జెరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు జరిగే 175 కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, మాల్‌ ప్రాక్టీస్‌కు అవకాశంలేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగేలా పోలీసు అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి సర్కిల్‌కు మొబైల్‌ పెట్రోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశామని, పరీక్షలు జరుగుతున్న సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు నిరంతరం తిరుగుతూనే ఉంటాయని వెల్లడించారు.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉదయం 9.30కు ఒక్క నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోనికి అనుమతించమని, విద్యార్థులు, తలిదండ్రుల ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులతో పాటు పరీక్షల విధులకు హాజరయ్యే అన్ని శాఖలకు చెందిన సిబ్బంది ఎలక్ట్రానిక్‌ పరికరాలను తీసుకొని రాకూడదని, పరీక్ష కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతరా సిబ్బంది, వ్యక్తులు ఉండరాదని స్పష్టంగా ఆదేశించారు. చిట్టీలు, పుస్తకాలు పెట్టి పరీక్షలు రాసినా, మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఘటన జరిగినా 100,112,కు డయల్‌ చేయాలని, 9121102266 నెంబరు పోలీసు వాట్సప్‌కు సమాచారం అందించాలని ఎస్పీ మలికా గర్గ్‌ కోరారు.

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఉదయం 9.30 కు ఒక నిముషం ఆలస్యమైనా లోపలికి నో ఎంట్రీ

ఎలక్ట్రానిక్‌ పరికరాలకు

అనుమతి లేదు

మాస్‌ కాపీయింగ్‌ కు పాల్పడితే చర్యలు

ఎస్పీ మలికా గర్గ్‌ వెల్లడి

Advertisement
Advertisement